English | Telugu
పెళ్లి కాని వాళ్లు ఉన్నారు.. రూమ్‌లో వాళ్ళేం చేస్తారు నాగన్నా?
Updated : Sep 13, 2022
బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులోమంచి ఫాలోయింగ్ ఉంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలామంది ఈ హౌస్‌లోకి వెళ్లివచ్చారు. బిగ్ బాస్ షోకి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా కంటెస్టెంట్ల పాపులారిటీ పెరిగిపోయింది. సెలబ్రిటీలు కానివారు కూడా హౌస్ లోకి వెళ్లి వచ్చాక ఆ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ షోకి ఎంత పాజిటివ్ టాక్ ఉందో అంతే నెగటివ్ టాక్ కూడా ఉంది. ఈ షో స్టార్ట్ ఐన దగ్గర నుంచి సీపీఐ అగ్ర నాయకుడు నారాయణ చేస్తున్న కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఇదివరకే బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ షోని బ్యాన్ చేయాలని, అందుకు ప్రజలే ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. ఐతే ఈయన కామెంట్స్ పై బిగ్ బాస్ యాజమాన్యం కానీ, హోస్ట్ నాగ్ కానీ స్పందించలేదు. ఇటీవల బిగ్ బాస్ 6 షోపై మరోసారి విరుచుకుపడ్డారు నారాయణ. దీనికి స్పందనగా నాగార్జున ఒక కౌంటర్ వేశారు.
ఈ షోలో మరీనా- రోహిత్ రియల్ కపుల్ అన్న విషయం తెలిసిందే. కెమెరాలన్నీ ఉండేసరికి రోహిత్ తన భార్యకు దూరంగా ఉండడం చూసిన హోస్ట్ నాగ్..వీకెండ్ ఎపిసోడ్‌లో మరీనాకు టైట్ హగ్ ఇవ్వాలని రోహిత్‌కు ఆర్డర్ వేశాడు. ఆ టైములో "నారాయణ.. నారాయణ.. వాళ్లు మ్యారీడ్" అని అన్నారు. ఇది కాకతాళీయంగా అన్నది కాదనీ, సీపీఐ నారాయణను ఉద్దేశించే ఆయన అన్నారనీ జనం అనుకుంటున్నారు.
అందుకే నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యకు కౌంటర్ గా ఒక వీడియో విడుదల చేశారు నారాయణ. “నాగన్నా.. నాగన్నా.. ఈ బిగ్ బాస్ షోలో పైళ్లైన వాళ్లకే లైసెన్స్ ఇచ్చారు, శోభనం గది ఏర్పాటు చేశారు. మరి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు.. రూమ్ లో వాళ్ళేం చేస్తారు? వాళ్లు బంధువులు కాదు కదా? మరి.. వాళ్ల సంగతి ఏంటో కూడా చెప్పన్నా?” అంటూ ప్రశ్నించారు. "నాగన్నా.. నాగన్నా" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.