English | Telugu

‘విశ్వంభర’ గ్లింప్స్‌.. పోతారు మొత్తం పోతారు.. కోత మొదలైంది!

మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ కావాల్సింది. రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఫైనల్‌గా వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ‘విశ్వంభర’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమా గ్లింప్స్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌.

తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్‌లో సినిమా ఎలా ఉండబోతోంది, కథ ఏమిటి? అనేది చెప్పే ప్రయత్నం చేశారు. ‘విశ్వంభర’లో అసలేం జరిగిందో.. ఈరోజైనా చెప్తావా మురా?’ అంటూ ఓ చిన్నపాప అడిగిన ప్రశ్నకు ‘ఒక సంహారం.. దాని తాలూకూ యుద్ధం.., ఒక్కడి స్వార్థం.. యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది..’ అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు మురా. అలా చెప్పే క్రమంలోనే హీరో ఇంట్రడక్షన్‌ మొదలవుతుంది.

పూర్తి స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఎంతో ఎఫెక్టివ్‌గా గ్లింప్స్‌ను కట్‌ చేశారు. కథ ఏ విధంగా ఉండబోతోంది. అందులోని విశేషాలు ఏమిటి? యుద్ధాన్ని ఆపే వీరుడి బలం ఏమిటి అనే అంశాలను చూచాయగా చూపించే ప్రయత్నం చేశారు. మెగాస్టార్‌ పుట్టినరోజున అభిమానులకు ఇది ఒక మంచి గిఫ్ట్‌గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్‌ ఎంతో రిచ్‌గా కనిపించింది. విజువల్‌ వండర్‌గా ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేసే అవకాశం ఉందనిపించింది. మెగాస్టార్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో సైతం ఎంతో వేగంగా కదులుతూ ప్రేక్షకులపై మునుపటి ఇంపాక్ట్‌ని కలిగించారు. రాబోయే సమ్మర్‌ మెగా బ్లాస్ట్‌ కానుంది.