English | Telugu
విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలీని టార్గెట్ చేశాడా..?
Updated : Jul 8, 2025
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఎదగడం అంత తేలిక కాదు. ఈ జనరేషన్ లో నాని, విజయ్ దేవరకొండ వంటి వారు.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. (Vijay Deverakonda)
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ తో తాను పూర్తిగా సంతృప్తి చెందనప్పటికీ, దానిని మార్చమని చెప్పే పొజిషన్ లో తాను లేనని, ఎందుకంటే తనకు బ్యాక్ గ్రౌండ్ లేదని అన్నాడు. అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న యాక్టర్ అయితే.. వాళ్ళ ఫాదర్ వచ్చి, స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని చెప్పడం లేదా కొందరు రచయితలను ఇవ్వడం వంటివి జరుగుతాయని విజయ్ చెప్పాడు.
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విజయ్ కామెంట్స్ కి మద్దతు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ కామెంట్స్ ని తప్పుబడుతున్నారు. ఇప్పుడు విజయ్ చిన్న హీరో కాదని, దర్శకులకు చెప్పే పొజిషన్ లోనే ఉన్నాడని గుర్తు చేస్తున్నారు. ఆ మాటకొస్తే.. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వగలిగే స్థాయి ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఏవైనా కారణాల వల్ల సీనియర్ దర్శకులకు చెప్పలేకపోతే.. నానిలా యంగ్ డైరెక్టర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇస్తూ.. విభిన్న కథలు చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.