English | Telugu

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒక్కసారి కాదు.. రెండు సార్లు వస్తుందట!

ఇటీవలికాలంలో స్టార్‌ హీరోలు పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలన్నీ రెండు భాగాలుగా రూపొందించడం మనం చూస్తున్నాం. ప్రతి సినిమా కథను రెండో భాగానికి అనుగుణంగానే సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా వెంకటేష్‌ హీరోగా రూపొందించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కూడా సీక్వెల్‌ ఉందని ఇటీవల దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రకటించారు. విక్టరీ వెంకటేశ్‌ కెరీర్‌లో అతనికి ఇది రెండో సీక్వెల్‌గా చెప్పొచ్చు. అనిల్‌ దర్శకత్వంలోనే వెంకటేష్‌ ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాలు చేశారు. ఈ రెండు సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వస్తున్న సినిమాకి వెరైటీగా సంక్రాంతి పండగనే టైటిల్‌గా పెట్టారు అనిల్‌ రావిపూడి. సాధారణంగా అతని సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం చిత్రం కూడా అదే పంథాలో ఉంటుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి కూడా సీక్వెల్‌ ఉందని అనిల్‌ రావిపూడి ఎనౌన్స్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.