English | Telugu
ఫిష్ వెంకట్‌కి ఆర్థిక సాయం అందించిన టాలీవుడ్ హీరో!
Updated : Jul 11, 2025
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ‘జెట్టి’ సినిమా హీరో కృష్ణ మానినేని తన ఫౌండేషన్ తరఫున రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. పిఆర్‌కె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్‌ని పరామర్శించిన కృష్ణ మానినేని అక్కడి వైద్యులతో మాట్లాడారు. వైద్య ఖర్చుల నిమిత్తం తమ 100 డ్రీమ్స్ ఫౌండేషన్ తరఫున రూ.2లక్షలు వెంకట్ కుమార్తె స్రవంతికి అందించారు. కృష్ణ అందించిన ఈ సాయం తమకెంతో ఆసరాగా నిలుస్తుందని, ఆయన గొప్ప మానవతావాది అని స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ ‘100 డ్రీమ్స్ ఫౌండేషన్‌ని ఒక కార్యమ్రం అయిన పునరపి(అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం..ఒక జీవితం’ అని తెలిపారు.