English | Telugu
'మహర్షి'ని వెనక్కి నెట్టిన 'సైరా'!
Updated : Oct 31, 2019
మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ నైజాం ఏరియాలో నాన్-బాహుబలి రికార్డును సృష్టించింది. 'బాహుబలి' రికార్డుల్ని అధిగమించే సత్తా ఉన్న సినిమాగా విడుదలకు ముందు అభిమానులతో పాటు ట్రేడ్ విశ్లేషకులు సైతం అంచనా వేసినప్పటికీ ఆ ఫీట్‌ను చిరంజీవి సినిమా సాధించలేకపోయింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదలయింది. మేధావుల, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా తెలుగునాట చెప్పుకోదగ్గ కలెక్షన్లను సాధించినా, దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఆ రకమైన వసూళ్లను సాధించడంలో విఫలమైంది.
హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రాకపోయినా, ఓ మాదిరి వసూళ్లయినా వస్తాయని నిర్మాత రాంచరణ్ వేసుకున్న అంచనాలు తప్పాయి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హిందీ ప్రేక్షకుల ఆరధ్య నటుడు అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవలి కాలంలో ఆయన చేసిన హిందీ సినిమాలు బాగా ఆడుతూ రావడం వల్ల 'సైరా' సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో ఆయన ఉపయోగపడతాడనే మేకర్స్ ఊహలు తారుమారయ్యాయి.
ఆ ప్రాంతాల్లో 'సైరా'కు ఆశించిన ధర పలకకపోవడంతో బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫరాన్ అఖ్తర్ సహకారంతో రాంచరణ్ స్వయంగా రిలీజ్ చేశాడు. కానీ చాలా చోట్ల కనీస వసూళ్లు కూడా రాకపోవడంతో వారం తిరిగేసరికల్లా చాలా థియేటర్ల నుంచి ఆ సినిమా మాయమైంది. ఆ థియేటర్లను 'సైరా'తో పాటే రిలీజైన 'వార్' మూవీ ఆక్రమించింది. ఇద్దరు యాక్షన్ స్టారు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఆ యాక్షన్ థ్రిల్లర్ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
కాగా 'సైరా' మూవీ నైజాంలో రూ. 30 కోట్ల షేర్ మార్కును దాటి, ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ మూడో స్థానంలో ఉన్న మహేశ్ మూవీ 'మహర్షి'ని వెనక్కి నెట్టేసింది. నైజాం హక్కుల్ని 30 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్న యు.వి. క్రియేషన్స్ సంస్థ, దిల్ రాజు సహకారంతో రిలీజ్ చేసింది. మొత్తానికి ఈ ప్రాంతంలో 'సైరా' సేఫ్ అనిపించుకుంది. నైజాంలో కలెక్షన్ల పరంగా తొలి రెండు స్థానాలూ ప్రభాస్-రాజమౌళి మూవీస్ 'బాహుబలి' పేరిటే ఉన్నాయి. ఏకంగా 68 కోట్ల రూపాయల షేర్‌తో 'బాహుబలి: ద కన్‌క్లూజన్' టాప్ ప్లేస్‌ను ఆస్వాదిస్తుండగా, 'బాహుబలి: ద బిగినింగ్' సెకండ్ ప్లేస్‌లో ఉంది. నిన్నటి దాకా మహేశ్, వంశీ పైడిపల్లి మూవీ 'మహర్షి' 29 కోట్ల 90 లక్షల రూపాయల షేర్‌తో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు 'సైరా' మూవీ 32 కోట్ల రూపాయల షేర్‌తో దాన్ని దాటేసి, ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇదే ప్రాంతంలో ఐదో స్థానంలో 28 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ సాధించిన 'సాహో' నిలిచింది. అంటే నైజాం ప్రాంతంలో టాప్ 5 మూవీస్‌లో మూడు ప్రభాస్ నటించినవే కావడం విశేషం.
తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా'లో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సాయిచంద్, రవికిషన్, అనుష్క, రఘుబాబు, పృథ్వీ వంటి పేరుపొందిన నటీనటులు నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించగా, బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాశారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన గ్రెగ్ పోవెల్, లీ విట్టేకర్ స్టంట్ డైరెక్షన్ అందించారు. ఇంతమంది మహామహులు పనిచేసిన ఈ సినిమాను 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రాంచరణ్ నిర్మించాడు. కానీ థియేటర్లలో ఆశించిన రీతిలో వసూళ్లను పొందలేకపోవడం బాధాకరం.