English | Telugu

'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ

సినిమా పేరు: మీకు మాత్రమే చెప్తా
తారాగణం: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వాణీ భోజన్, పావని గంగిరెడ్డి, అనసూయ భరద్వాజ్, నవీన్ జార్జి థామస్, నవీన్ వర్మ
సంగీతం: శివకుమార్
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
ఆర్ట్: రాజ్‌కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ
రచన-దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
బ్యానర్: కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 1 నవంబర్ 2019

స్వల్ప కాలంలోనే యూత్ ఐకాన్‌గా గుర్తింపుపొందిన హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా కావడంతో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. పైగా 'పెళ్ళిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయమవడం ఆ ఆసక్తిని మరింత పెంచింది. తమిళుడైన షమ్మీర్ సుల్తాన్ తన దగ్గరకు తెచ్చిన కథ నచ్చినప్పటికీ, తన ప్రస్తుత ఇమేజ్‌కు ఆ సబ్జెక్ట్ సరిపోదని భావించిన విజయ్, ఆ కథను వదులుకోవడం ఇష్టంలేక తరుణ్ భాస్కర్ హీరోగా తనే నిర్మాతగా మారి తీశాడు. అతనికి బాగా నచ్చిన ఆ కథ తెరపై ఎలా ఉందంటే...

కథ:

టీఆర్‌పీలో అడుగున ఉండే ఒక టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేసే రాకేశ్ (తరుణ్ భాస్కర్) డాక్టరైన స్టెఫీ (వాణీ భోజన్)తో ప్రేమలో పడతాడు. అతడు తన దగ్గర ఎలాంటి అరమరికలు లేకుండా, అబద్ధాలు చెప్పకుండా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలని స్టెఫీ భావిస్తుంది. కానీ ఆమెకు తన అలవాట్ల గురించి, తన లైఫ్ స్టైల్ గురించీ అన్నీ అబద్ధాలే చెప్పుకుంటూ, దొరికిపోతూ వస్తుంటాడు. అయినప్పటికీ అతడిని ప్రేమించిన ఆమె పెళ్లికి ఒప్పుకుంటుంది. రేపు పెళ్లనగా, ఈరోజు అతడికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుంది. అది స్టెఫీ దృష్టిలో పడకముందే డిలీట్ చేయించడానికి రాకేశ్ చేసే ప్రయత్నాలు ఏమయ్యాయి? స్టెఫీకి ఆ వీడియో గురించి తెలిసిందా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యడానికి ఒక అబద్ధం ఆడితే, ఆ తర్వాత దాన్ని నిజం అని నమ్మించడానికి వరుసగా ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో, ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే లైఫ్‌లో ఇన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుందో, 'మీకు మాత్రమే చెప్తా.. ఇంకెవ్వరికీ చెప్పొద్దు' అంటూ మనం మనకు తెలిసిన విషయాన్ని ఎలా పబ్లిక్ చేస్తుంటామో.. అనే లైన్‌పై ఆధారపడిన కథను పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడానికి డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ ప్రయత్నించాడు. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ మీద నడిచే ఈ స్టోరీ జనరంజకం కావాలంటే, అదుకు తగ్గ కథనం అవసరం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఎప్పుడూ కత్తిమీద సాము వ్యవహారం. బ్యాలెన్స్ తప్పిందా, పాత్రల ఫ్రస్ట్రేషన్ అంతా ప్రేక్షకుల మీద పడుతుంది.

పెళ్లికి ఒక రోజు ముందు తనకు సంబంధించిన 'హనీమూన్' వీడియో ఒకటి లీక్ అవడం, అదెక్కడ స్టెఫీ కంట్లోపడి, తన పెళ్లి ఆగిపోతుందోననే భయం.. కలిసి రాకేశ్‌ను ఫ్రస్ట్రేషన్‌కు గురిచేస్తాయి. ఆ ఫ్రస్ట్రేషన్‌తో అతడు చేసే పనులు హాస్యాన్ని పుట్టిస్తాయి. అతనికి తోడుగా ఎప్పుడూ సలహాలిచ్చే ఒక ఫ్రెండ్ (అభినవ్ గోమఠం) ఉంటాడు. ఆ ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు, వాళ్ల సంభాషణలు ఫస్టాఫ్ వరకు సరదాగానే అనిపిస్తాయి, వినోదాన్ని పంచుతాయి. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత వచ్చే సన్నివేశాలు వినోదాన్ని కలిగించడానికి బదులు చికాకు పుట్టిస్తూ వెళ్లాయి. ఒకవైపు ఆ వీడియో క్లిప్‌ను అప్‌లోడ్ చేసిన వ్యక్తిని కనిపెట్టడం, మరోవైపు 'నేను వారియర్'ని అంటూ స్టెఫీని పెళ్లిచేసుకోవాలనుకొనే ఆమె బావపెట్టే ఇరిటేషన్‌తో రాకేశ్ అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుని విలవిలలాడుతుంటే.. మనకు ఆ పాత్రపై సానుభూతి కలగాలి.

కానీ ఆ సానుభూతి కలిగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కారణం.. రాకేశ్ క్యారెక్టరైజేషన్. అతను తక్షణ సమస్య నుంచి ఎస్కేప్ అవడానికి ప్రతిసారీ అబద్ధం చెబుతుంటే, 'ఈసారైనా నిజం చెప్పరా' అని ప్రేక్షకుడు అనుకుంటూ వస్తాడు. కానీ అందుకు భిన్నంగా అతను అబద్ధం చెబుతుంటే, మనకు చికాకు వేస్తుంది. చివరలో వచ్చే ట్విస్టుతో మనం మరింత అసహనానికి గురవుతాం. కొన్ని సంభాషణలు నవ్వు తెప్పించినా, 'హనీమూన్' వీడియో చుట్టూ కథ నడపడం సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ప్రొడక్షన్ విలువలు నాణ్యంగా కనిపించలేదు. మ్యూజిక్ సాధారణంగా, సినిమాటోగ్రఫీ ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా నిడివి రెండు గంటల లోపే ఉన్నప్పటికీ ప్రేక్షకులు సెకండాఫ్‌ను ఆస్వాదించలేరు.

ప్లస్ పాయింట్స్:

ఫస్టాఫ్‌లోని వినోదాత్మక సన్నివేశాలు
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం మధ్య సంభాషణలు

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ స్క్రీన్‌ప్లే
హీరో క్యారెక్టరైజేషన్
'హనీమూన్' వీడియో చుట్టూ కల్పించిన సీన్లు
క్లైమాక్స్ ట్విస్ట్
క్వాలిటీలేని ప్రొడక్షన్ విలువలు

నటీనటుల అభినయం

రాకేశ్‌గా ప్రధానపాత్రను సాధ్యమైనంత బాగా చెయ్యడానికి ట్రై చేశాడు స్వతహాగా డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్. కానీ క్యారెక్టరైజేషన్‌లోని ఫ్రస్ట్రేషన్ కారణంగా అతని శ్రమ వృథా అయ్యింది. కానీ నటుడిగా పనికొస్తాడనే నమ్మకాన్ని తన అభినయం ద్వారా కలిగించాడు. రాకేశ్ క్లోజ్ ఫ్రెండుగా నటించిన అభినవ్ గోమఠం ఫస్టాఫ్‌లో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్ మొదలై క్లైమాక్స్‌కు ట్రావెల్ అయ్యేకొద్దీ అతని పాత్ర కూడా అసహనానికి గురిచెయ్యడం, అసందర్భప్రలాపిలా కనిపించడంతో చివరాఖరికి అతనూ చేతులెత్తేశాడు. రాకేశ్ చెప్పే అబద్ధాలకు ఎప్పుడూ అసహనానికి గురవుతుండే స్టెఫీ పాత్రలో వాణీ భోజన్ ఫర్వాలేదనిపించింది. ఆమె ముఖంలోని ఆకర్షణ.. ఫరెవర్ ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్ కారణంగా మసకబారింది. గోమఠం లవర్ జాక్వలిన్‌గా పావని గంగిరెడ్డి బాగుంది. 'హనీమూన్' వీడియోలో తరుణ్‌తో నటించిన అవంతిక మిశ్రా, ఆమె అంకుల్‌గా వినయ్ వర్మ, వీడియోను డిలీట్ చెయ్యడానికి ట్రై చేసే హ్యాకర్ ఫ్రెండుగా నవీన్ జార్జి థామస్, అతని అక్కగా అనసూయా భరద్వాజ్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

తెలుగు్ఒన్ పర్‌స్పెక్టివ్:

ప్రధాన పాత్రలన్నీ ఫ్రస్ట్రేషన్‌తో సతమతమయ్యేవి కావడం, సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా ఎలా మలచాలో బోధపడక అడ్డదిడ్డంగా నడపడం, క్లైమాక్స్ ట్విస్ట్, నిర్మాణ విలువలు నాణ్యంగా లేకపోవడం.. అనే అనేకానేక బలహీనలతో నిర్మాతగా విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ 'మీకు మాత్రమే చెప్తా' మనల్ని కూడా ఫ్రస్ట్రేషన్‌కు గురిచేస్తుంది.

రేటింగ్: 2/5

- బుద్ధి యజ్ఞమూర్తి

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.