English | Telugu
ఈ నెల 31న ‘కుమారి 21ఎఫ్’ సాంగ్స్
Updated : Oct 20, 2015
రాజ్ తరుణ్ - హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సుకుమార్ రైటింగ్స్ పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. చిత్ర గీతాల్ని ఈ నెల 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటలు ప్రముఖ యువ కథానాయకుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ‘ సుకుమార్ మార్క్ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. తనను ప్రేమించడానికి పేరు వయసుతో తప్ప ఆస్తిపాస్తులు కుటుంబ నేపథ్యంతో పనిలేదని విశ్వసించే ఓ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చే ప్రేమికుడు దొరికాడా?లేదా? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిస్తున్న విలక్షణ ప్రేమకథా చిత్రమిది. సుకుమార్ అందించిన కథ కథనాలతో పాటు సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రత్నవేలు ఛాయాగ్రహణం సినిమాకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది.
ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభిస్తోంది. దేవిశ్రీప్రసాద్ వినసొంపైనా బాణీలనిచ్చారు. ఈ నెల 31న అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ చిత్ర గీతాల్ని విడుదల చేస్తున్నాం. కొత్తదనాన్ని నమ్మి చేస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. నోయల్ - నవీన్ - సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్రెడ్డి ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్.