English | Telugu
రజనీ సినిమాకి కాపీ మరక
Updated : Nov 13, 2014
ఈ కథ నాదే, ఈ టైటిల్ నాదే... అంటూ ఎవరో ఒకరు కోర్టు మెట్లెక్కడం, ఆ సినిమాకి కావల్సినంత ఉచిత ప్రచారం చేసిపెట్టడం ఈమధ్య మామూలైపోయింది. తమిళ సినిమా 'కత్తి' విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా కథ నాదే అంటూ కోర్టుకెక్కారు. ఆ విషయం ఇంకా నలుగుతూనే ఉంది. ఈలోగా సినిమా విడుదలై, సూపర్ హిట్ అయ్యి, కోట్లు కొల్లగొట్టుకొంది. ఇప్పుడు రజనీకాంత్ సినిమా లింగాకీ ఇదే రీతిలో కాపీ మరక అంటింది. ఈ సినిమా విడుదలపై స్టే కోరుతూ మధురై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రవి రత్నం అనే ఒకాయన లింగా చిత్ర కథ, తాను తీసిన ‘ముల్లైవనం 999’ కథ ఒక్కటేనని పిటీషన్ దాఖలు చేశారు. నా కథ కాపీ కొట్టి మళ్లీ తీయడం అన్యాయం అంటూ.. వాదిస్తున్నారు.
ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు చిత్రబృందానికి నోటీసులు పంపింది. అతి తొందర్లో వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. దాంతో లింగా బృందం ఇబ్బందుల్లో పడినట్టైంది. ఇదంతా పిటీషినర్లు ప్రచారం కోసం చేస్తున్నట్రిక్ అని, ఇలాంటి కేసులు నిలిచిన దాఖలాలు లేవని చెన్నై సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. కాకపోతే.. విడుదలకు ముందు చిత్రబృందానికి ఇది తలనొప్పి వ్యవహారమే.