English | Telugu
ప్రభాస్‌ని.. బాహుబలి వదలట్లేదు!
Updated : Jun 16, 2015
దాదాపు రెండున్నర సంవత్సరాలు బాహుబలితోనే గడిపేశాడు ప్రభాస్. ఇప్పుడు ఆ సినిమా ముందుకొస్తోంది. బాహుబలి వల్ల రెండేళ్ల పాటు మరే సినిమానీ ఒప్పుకోలేకపోయాడు. కనీసం కథలు కూడా వినలేదు. చివరాఖరికి సుజీత్ (రన్ రాజా రన్ ఫేమ్) కథకి ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. మేలో ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ బాహుబలి పూర్తికాకపోవడంతో ఆగిపోయింది.
ఇప్పుడు పార్ట్ 1 పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. అయినా.. సుజిత్ సినిమా మొదలవ్వలేదు. బాహుబలి జులై 10న విడుదల కానుంది. ఆ తరవాతే.. సుజిత్ సినిమా కొబ్బరికాయ్ కొట్టుకొంటుందనుకొన్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే.. బాహుబలి పార్ట్ 2లో ఇంకా 30 శాతం షూటింగ్ మిగిలి ఉంది. ''పార్ట్ 2 షూటింగ్ పూర్తిచేశాకే... కొత్త సినిమా ఒప్పుకో....'' అని ప్రభాస్ ని రాజమౌళి బలవంతం చేస్తున్నాడట. అయితే ప్రభాస్ మాత్రం.. 'బాహుబలి 1 రిజల్ట్ బట్టి ఆలోచిద్దాం' అంటున్నాడట.
ఒకవేళ బాహుబలి ఊహించిన రీతిలోనే రికార్డులు బద్దలుకొట్టే చిత్రమైతే, అదే ఊపులో 2 కూడా పూర్తి చేద్దామనుకొంటున్నాడు ప్రభాస్. అనుకొన్న అంచనాల్ని అందుకోకపోతే మాత్రం.. బాహుబలి 2కి కొంత బ్రేక్ ఇచ్చి ఈలోగా ఓ సినిమా పూర్తిచేద్దామని భావిస్తున్నాడు. ప్రభాస్‌కొత్త సినిమా ఎప్పుడు అనేది ... బాహుబలి 1 రిజల్టే నిర్ణయించాలి.