English | Telugu

ప‌వ‌న్ ఫ్యాన్స్ Vs ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

భీమవ‌రంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.. ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు రాజుకొంది. ఇద్ద‌రు హీరోల అభిమానులు నువ్వా, నేనా అనుకొంటున్నారు. మా హీరోనే హీరో, మీ హీరో జీరో అంటూ క‌వ్వించుకొంటున్నారు. రోడ్డుపై రాళ్లు రువ్వుకొంటున్నారు. రాడ్లు ప‌ట్టుకొని.. తిరుగుతున్నారు. భీమ‌వ‌రంలో ప‌వ‌న్, ప్ర‌భాస్ అభిమానుల మ‌ధ్య రాజుకొన్న వైరం చినికి చినికి గాలివాన‌గా మారుతోంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే రోజున భీమ‌వ‌రంలో ఓ ప‌వ‌న్ అభిమాని ప్ర‌భాస్ ఫ్లెక్సీని చింపేశాడ‌ట‌. అక్క‌డ మొద‌లైన గొడ‌వ‌.. ఇప్పుడు ఉదృతరూపం దాల్చింది. ప‌వ‌న్ పుట్టిన రోజున రాత్రి భీమ‌వ‌రంలో ప్ర‌భాస్‌, ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య ర‌గ‌డ జ‌రిగింది. దాదాపు 200మంది ఫ్యాన్స్ క‌లబ‌డి కొట్టుకొన్నారు. ఏటీమ్ అద్దాల్ని బ‌ద్ద‌లుకొట్టారు. దాంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. అక్క‌డ 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంది. డీసీపీ ఈ కేసుని ప‌ర్య‌వేక్షించి.. ఇద్ద‌రు అభిమానుల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌చ్చ‌డాని ప్ర‌య‌త్నించారు. అయితే.. అది డీసీపీ వ‌ల్ల కూడా వీలుకాలేదు. త‌మ‌పై దాడి చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులపై కేసులు న‌మోదు చేయాల‌ని ప్ర‌భాస్ అభిమానులు ప‌ట్టుప‌ట్టారు. దాంతో శుక్ర‌వారం కొంత‌మంది ప‌వ‌న్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాంతో భీమ‌వ‌రం పోలీస్ స్టేష‌న్ ద‌గ్గ‌ర క‌ల‌క‌లం మొద‌లైంది. స్టేష‌న్ బ‌య‌ట ప‌వ‌న్ అభిమానులు ద‌ర్నాకు దిగారు.

ప్రభాస్ అభిమానుల్నీ పిలిపించి విచార‌ణ జ‌రిపించాల‌ని లేదంటే... పోలీసుల్ని క‌ద‌ల‌నివ్వ‌మ‌ని డిమాండ్ చేస్తున్నారు. ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకొన్నా... మ‌రో వ‌ర్గం నిర‌స‌న‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతో ఈ వ్య‌వ‌హారం పోలీసుల‌కు త‌ల‌నొప్పి తీసుకొచ్చింది. మ‌రి ఈ టాప్ హీరోల ఫ్యాన్స్ ఎప్పుడు శాంతిస్తారో చూడాలి. స్వ‌యంగా ప‌వ‌న్‌, ప్ర‌భాస్ లు రంగంలోకి దిగితే త‌ప్ప‌... ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు ప‌డేట్టు లేదు.