English | Telugu
లీకేజీనా.. లేదంటే పబ్లిసిటీ స్ట్రాటజీనా??
Updated : Feb 4, 2015
లీకు వీరులు ఇప్పుడు ఇండ్రస్ట్రీలోనూ తయారయ్యారు. సినిమాని ఏ రూపంలో ముందే బయటకు తీసుకొచ్చేద్దామనా అని చూస్తున్నారు. అంతకు ముందు సినిమాలోని ఒకట్రెండు సీన్లు, లేదంటే ఓ పాటో, లేదంటే కొన్ని డైలాగులే బయటకు వచ్చేవి. అత్తారింటికి దారేది తరవాత... ఈ లీకేజీల పర్వం పరాకాష్టకు చేరుకొంది. ఏకంగా సగం సినిమా బయటకు వచ్చేసి.. పరిశ్రమలో గుబులు పెంచింది. ఆ సానుభూతో, లేదంటే లీకేజీ వల్ల వచ్చిన పబ్లిసిటీలో, లేదంటే అంతకు మించిన విషయం సినిమాలో ఉండో అత్తారింటికి దారేది రికార్డులన్నీ కొల్లగొట్టింది. దాంతో లీకేజీ లో డామేజీనే కాదు పబ్లిసిటీ స్ట్రాటజీ కూడా ఉందని అర్థమైంది. ఇదిగో నిన్న బాహుబలి లీకైంది. ఇప్పుడేమో.. రుద్రమదేవి కూడా లీకైందంటున్నారు. మధ్యమధ్యలో అడపా దడపా.. `మా సినిమాలో స్టిల్స్ అనుకోకుండా బయటకు వచ్చేశాయ్` అని కొందరు, `మా సినిమాలోని వీడియో క్లిప్పింగ్స్ లీక్ చేశార`ని మరి కొందరు బావురు మన్నారు. అయితే రాను రాను ఈ లీకేజీల వ్యవహారం మరీ పరాకాష్టకు చేరుకొంది. `ఇదంతా కావాలని చేస్తున్న హంగామా అండీ.. ఇదో పబ్లిసిటీ` అంటూ కొందరు బాహాటంటానే విమర్శిస్తున్నారు. అదీ నిజమే కావచ్చు. ఎందుకంటే లీక్ అయ్యిందన్న వార్త.. సినీ పరిశ్రమ చుట్టూ చక్కర్లు కొడితే ఎంత పబ్లిసిటీ, ఇంకెంత సింపతీ..?? కానీ ఖర్చు లేకుండా టీవీల్లో, పేపర్లలో, వెబ్ సైట్లలోనూ ఇవే వార్తలు షికారు చేస్తుంటాయి. అయితే కేవలం పబ్లిసిటీ కోసం తమ సినిమాని పణంగా పెడతారా?? అనేదీ అనుమానమే. బాహుబలి కోట్లు ధారబోసి తీసిన సినిమా. కావాలని దాన్ని లీక్ చేయరుగా..?? అత్తారింటికి దారేది సగం సినిమా బయటకు వచ్చేసింది. ఇదంతా... కావాలని చేసింది కాదు కదా..? అయితే సందట్లో సడేమియా అన్నట్టు కొంతమంది `మా సినిమా కూడా లీకైంద`ంటూ కొన్ని వార్తల్ని కావాలనే సృష్టిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. ఏమిటో ఈ ట్రెండ్. తెలుగు సినిమా ట్రెండ్‌ని ఫాలో అవ్వడం నిజమే కానీ. లీకేజీలోనూ ఈ ట్రెండే పట్టుకొని వేలాడితే ఎలా...?? సిల్లీగా లేదూ!