English | Telugu

"వంద" కొట్టిన తెలుగు హీరోలు

నందమూరి అందగాడు, నటసింహ బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ సినిమా పుణ్యమా అని అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వంద సినిమాలు చేసిన హీరోలు ఎవరా అని వెతుకుతున్నారు ప్రేక్షకులు. హీరోగా వంద సినిమాలు చేయడమంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాని కొందరు హీరోలు ఆ ఫీట్‌ను సాధించి రికార్డుల్లోకి ఎక్కారు. అలాంటి శతకవీరుల గురించి మీ కోసం..

ఎన్టీఆర్:

తెలుగు సినీ ప్రపంచంలో మకుటం లేని మారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన కెరిర్‌లో దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. అన్నగారి 100వ చిత్రం "నర్తనశాల". ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అనన్య సామాన్యం. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్స్‌లో ఒకటి

ఎఎన్నార్:

తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పుకునేవారిలో ఒకరు ఎన్టీఆర్ కాగా రెండవ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. భగ్నప్రేమికుడిగా, నవలా నాయకుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు ఏఎన్నార్.సామాన్య మానవుడికి చెందిన అన్ని కోణాలు దాదాపు ఆయన తెర మీద ఆవిష్కరించారు. ఏడు దశాబ్ధాల సినీ జీవితంలో ఆయన నటించిన చిత్రాలు 256. ఏఎన్నార్ 100వ చిత్రం "మణితన్ మరవిల్లై" అనే తమిళ్ చిత్రం.

కృష్ణ:

తెలుగు తెరకు కొత్తదనాన్ని పరిచయం చేసిన నటశేఖర, సూపర్‌స్టార్ కృష్ణ గారు టాలీవుడ్‌లో హీరోగా అత్యధిక చిత్రాల్లో నటించిన ఏకైక హీరో. షిఫ్టుల వారీగా పనిచేసి ఇండస్ట్రీ బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మిన మనసున్న మనిషి. ఎందరికో సాధ్యంకాక వదిలేసిన "అల్లూరి సీతారామరాజు" చిత్రాన్ని తన వందో చిత్రంగా ఎంచుకుని సంచలనాలకు కేరాఫ్ అయ్యారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కృష్ణగారి కెరిర్‌లోనే గాక తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.

శోభన్‌బాబు:

ఎన్టీఆర్, ఎన్టీఆర్, కృష్ణలు తెలుగు తెరను ఏలుతున్న కాలంలో ఎవరి అండా లేకుండా సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగారు శోభన్‌బాబు. తెలుగు తెరకు అందాల నటుడిగా కీర్తి గడించిన శోభన్ తన కెరిర్‌లో దాదాపు 230 చిత్రాల్లో నటించారు. మహిళా ప్రేక్షకుల ఆరాధ్యనటుడిగా ఆయన ట్రెండ్ సెట్ చేశారు. ఆయన వంద సినిమా "కన్నవారి కలలు"

కృష్ణంరాజు:

తెలుగు తెరపై పవర్‌ఫుల్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ రెబల్ స్టార్ కృష్ణం రాజు. ఆయన కోసం రచయితలు ప్రత్యేకంగా అలాంటి పాత్రలే సృష్టించేవారు. హీరోగా వచ్చి, విలన్‌గా మారి, మళ్లీ హీరోగా సక్సెస్‌ అయ్యారు కృష్ణంరాజు. దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు వందో చిత్రం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన "రంగూన్ రౌడీ".

చిరంజీవి:

తెలుగు తెరను ఎన్టీఆర్ తర్వాత అంతగా ప్రభావితం చేసింది ఎవరు అంటే వచ్చే సమాధానం మెగాస్టార్ చిరంజీవి. తన ట్రేడ్ మార్క్ డాన్స్‌లతో, ఫైట్స్‌తో మెగాస్టార్‌గా ఎదిగారు చిరు. దాదాపు రెండున్నర దశాబ్ధాల కాలం పాటు తెలుగు తెరను నెంబర్ వన్‌గా పాలించి.. అన్నగారి తర్వాత ప్రేక్షకులతో అన్నయ్య అని పిలిపించుకున్న ఏకైక వ్యక్తి చిరంజీవి. ఆయన 100వ సినిమా 1988లో వచ్చిన "త్రినేత్రుడు".

మోహన్ బాబు:

మోహన్‌బాబుగా మనకు తెలిసిన మంచు భక్తవత్సలం నాయుడు ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా టాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. దాదాపు 550 పైచిలుకు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు

రాజేంద్రప్రసాద్:

అన్నగారి అడుగు జాడల్లో నటనలో ఓనమాలు దిద్దుకున్న గద్దె రాజేంద్రప్రసాద్ స్నేహం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించి ఆంధ్రా ఛార్లీ ఛాప్లిన్‌గా, నటకిరిటీగా నిలిచారు. ఎంతగా నవ్వించగలనో..అంతగా ఎడిపించగలనని నిరూపించారు.

శ్రీకాంత్:

సహాయనటుడిగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా, ఆ తర్వాత హీరోగా మారారు శ్రీకాంత్. తాజ్‌మహాల్, పెళ్లిసందడి వంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోగా కుటుంబ ప్రేక్షకుల్ని అలరించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన "మహాత్మ" శ్రీకాంత్ వందో సినిమా.

బాలకృష్ణ:

ఎన్టీఆర్ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ దర్శకత్వంలో "తాతమ్మకల" ఆయన తొలి సినిమా. అనాటి నుంచి నేటి వరకు యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్ని ఫార్మాట్లలో తండ్రిని మించిన తనయుడయ్యాడు. ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగు దశాబ్ధాలు గడిచినా నేటికి అదే ఎనర్జీతో దూసుకుపోతున్నారు బాలయ్య. హీరోగా 99 సినిమాలు కంప్లీట్ చేసిన నటసింహ ఈ మధ్యే తన వందో సినిమాను ప్రారంభించారు. తెలుగుజాతి చరిత్రలోనే గొప్ప చక్రవర్తిగా పేరొందిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథతో ఆయన పేరు మీదుగానే "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించి బాలయ్య కెరిర్‌లో మరుపురాని చిత్రంగా మిగిలిపోవాలని కోరుకుందాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.