English | Telugu
బాలయ్య క్రేజ్.. ఒకేసారి పది కోట్లు పెరిగిన రెమ్యూనరేషన్!
Updated : Oct 30, 2023
కొందరు హీరోలు ఒక్క హిట్ రాగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తారు. ఆ తర్వాత ఫ్లాప్ లు ఎదురైనా, నిర్మాతలకు నష్టాలు వచ్చినా అక్కడి నుంచి కిందకి దిగరు. అయితే ఇలాంటి కొందరు హీరోలున్న పరిశ్రమలో.. పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోని అరుదైన హీరో నందమూరి బాలకృష్ణ.
బాలకృష్ణను నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరో అంటారు. సినిమా హిట్ అవ్వగానే రెమ్యూనరేషన్ పెంచే రకం కాదు ఆయన. క్రేజ్ ని, మార్కెట్ ని పట్టించుకోకుండా రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ముందునుంచి బాలయ్యకి అలవాటు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు అంత ఆసక్తి చూపిస్తారు.
ప్రస్తుతం బాలకృష్ణ మరే ఇతర సీనియర్ స్టార్ లేనంత ఫామ్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు బాగా లాభాలు చూస్తున్నారు. అందుకే బాలయ్య అడగకుండానే నిర్మాతలు ఆయన పారితోషికం పెంచుకుంటూ పోతున్నారు.
'అఖండ' సినిమాకి బాలకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు మాత్రమే. ఆ సమయంలో బాలయ్య కంటే తక్కువ మార్కెట్ ఉన్నవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. కానీ బాలయ్య ఎప్పుడూ ఆ లెక్కలు పట్టించుకోలేదు. 'అఖండ' ఘన విజయం సాధించడంతో.. 'వీరసింహారెడ్డి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. అది కూడా విజయం సాధించడంతో 'భగవంత్ కేసరి' నిర్మాతలు రూ.14 కోట్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు తదుపరి సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా రూ.28 కోట్లు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య తన తదుపరి సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్యకు రూ.28 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సితార సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో ఉన్నారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో ఆయన సినిమాలు రూ.150 కోట్లకి పైగా బిజినెస్ చేస్తున్నాయి. అందుకే నిర్మాతలు బాలయ్య అడిగినా, అడగకపోయినా రెమ్యూనరేషన్ పెంచుతున్నారు. 2021 లో వచ్చిన 'అఖండ'కి రూ.10 కోట్ల పారితోషికం అందుకోగా, రెండేళ్లలోనే అది రూ.28 కోట్లకి చేరింది అంటే ప్రస్తుతం బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.