English | Telugu

ఆ విషయంలో బాలయ్యబాబుని చూసి యంగ్‌ హీరోలు ఎంతో నేర్చుకోవాలి!

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో చెప్పే డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో, నిజ జీవితంలో ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి. తను చెప్పదలుచుకున్న విషయాన్ని కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. ఎవరేమనుకున్నా తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా మొహం మీదే చెప్పేస్తారు. ‘అఖండ2’ చిత్రానికి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలను తనదైన పద్ధతిలో చెప్పారు బాలయ్య.

చిత్ర పరిశ్రమలో ఉన్న ఎవరికైనా డిసిప్లిన్‌ ఉండాలని, యూనిట్‌లోని అందర్నీ గౌరవించాలని ఆయన సూచించారు. మనిషికి ఉన్న నిత్యావసరాలలో సినిమా కూడా ఒకటని, అలాంటి సినిమా కోసం చిత్రపరిశ్రమలోని పెద్దలు ఆలోచించాలన్నారు. అలాగే షూటింగ్స్‌లో జరుగుతున్న జాప్యం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అఖండ2 విషయానికి వస్తే.. ఎన్నో డిఫరెంట్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశామని, అయినప్పటికీ అనుకున్న సమయంలో సినిమాని పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి నుంచి ఆ క్రమశిక్షణ తనకు వచ్చిందని, దాన్ని పరిశ్రమలోని వారంతా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

బాలయ్య చెప్పిన మాటలు అక్షరాలా నిజమని సినీ పండితులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా పూర్తి కావాలంటే కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. దానివల్ల బడ్జెట్‌ పెరిగిపోవడమే కాకుండా సినిమాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. దాన్ని నివారించాలంటే బాలయ్య సూచనలు పాటించడం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము చేసే సినిమాల క్వాలిటీ బాగుండాలన్న ఉద్దేశంతో నెలల తరబడి షూటింగ్స్‌ చేస్తే నిర్మాత నష్టపోయే అవకాశం ఉందని అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ హీరోలు సైతం సంవత్సరానికి ఒక సినిమా చేయడం కష్టంగా మారిపోతోంది. ఈ విషయంలో బాలయ్యను చూసి అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 65 ఏళ్ళ వయసులోనూ యంగ్‌ హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు అఖండ2తో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇదే వేగాన్ని పాటిస్తే చిత్ర పరిశ్రమ కళకళలాడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.