English | Telugu

'మిథునం' రచయిత శ్రీరమణ ఇక లేరు!

పేరడీ రచనలకు పేరొందిన ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ (70) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీరమణ అసలు పేరు కామరాజ రామారావు. 1952 సెప్టెంబర్ 21న గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో ఆయన జన్మించారు. ఆంధ్రజ్యోతి నవ్యతో పాటు సాక్షి పత్రికలో ఆయన పనిచేశారు. అలాగే సినీ ప్రముఖులు బాపు - రమణ దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది. సాహిత్య, కళా రంగాలకు పలు విధాలుగా విశిష్ట సేవలందించారు.

ఇక ఆయన రచించిన 25 పేజీల 'మిథునం' కథ.. 2012లో తెరరూపం దాల్చింది. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ముఖ్య పాత్రల్లో అలరించారు. 'అరవై దాటిన అమ్మనాన్నల అల్లరి ప్రేమకథ'గా రెండు పాత్రల చుట్టూ తిరిగే ఈ సినిమా.. 50 రోజుల పాటు ప్రదర్శితమైంది. అలాగే.. నాలుగు 'నంది' పురస్కారాలను అందుకుంది. శ్రీరమణ ఈ కథ రచించిన దాదాపు పాతికేళ్ళ తరువాత 'మిథునం' సినిమాగా తెరకెక్కడం విశేషం. 'మిథునం' లాంటి మంచి కథను అందించిన శ్రీరమణ మరణం పట్ల.. చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.