English | Telugu
చిరు, చరణ్.. దొందు దొందే!
Updated : Apr 4, 2016
మెగా హీరోలు అటు చిరంజీవి, ఇటి రామ్‌చరణ్ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. తమ సినిమాల విషయంలో ఇద్దరూ ఒకే పంథా ఫాలో అవుతున్నారు. చిరంజీవి కత్తి, రామ్‌చరణ్ తని ఒరువన్... ఇద్దరూ రీమేక్ కథలనే ఎంచుకొన్నారిప్పుడు. రిస్క్ లేని ప్రయాణం సాగించడం బెటర్ అని ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫిక్సయిపోయినట్టున్నారు. అంతేకాదు.. రీమేక్‌లో ఉన్నది మక్కీకి మక్కీ దించేయాలని, సొంత బుర్ర వాడి సినిమాని పాడుచేయొద్దంటూ... దర్శకులు చెప్పేశారట. చిరు సినిమాకి వినాయక్ దర్శకుడన్న సంగతి తెలిసిందే.
చిరుతో ఇది వరకు వినాయక్ తీసిన ఠాగూర్ కూడా రీమేక్ సినిమానే. అన్నయ్య చిరుతో ఎలా ఉండాలో వినాయక్‌కి బాగా తెలుసు. కాబట్టి.. కత్తి రీమేక్ విషయంలో ఉలాంటి ప్రయోగాల జోలికీ వెళ్లకుండా.. తమిళంలో ఉన్నది ఉన్నట్టు తర్జుమా చేస్తున్నాడట. చివరాఖరికి కత్తి సినిమాకి తెలుగులో పేరు పెట్టడానికీ.. పెద్దగా ఆలోచించలేదని తెలుస్తోంది. కత్తి అని తెలుగుకీ అదే పేరు పెడదామనుకొన్నారు. అయితే ఆల్రెడీ కల్యాణ్‌రామ్ ఈ పేరుతో ఓ సినిమా తీసేశాడు. కాబట్టి.. ఇప్పుడు కత్తిలాంటోడు అంటూ కత్తి సినిమాని గుర్తు తెచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశారు.
మరోవైపు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు చరణ్ కూడా. బ్రూస్లీతో చరణ్‌కి ఓ భారీ ఫ్లాప్ తగిలింది. ఈ నేపథ్యంలో ప్రయోగాల జోలికి వెళ్లి రిస్క్ తీసుకవడం ఇష్టం లేదు. పైగా కిక్ 2తో సురేందర్ రెడ్డి కూడా ఓ డిజాస్టర్ అందుకొన్నాడు. చరణ్ ఏం చెబితే అది చేయడం మినహా.. మరో గత్యంతరం లేదు. తని ఒరువన్‌లో ఉన్నది ఉన్నట్టు తీయమని.. మార్పులు చేసి మాతృకలోని ఫ్లేవర్‌ని పాడుచేయెద్దని క్లియర్ కట్‌గా చెప్పేశాడట చరణ్. దాంతో.. అటు వినాయక్, ఇటు సురేందర్ రెడ్డి కాస్త పీలవుతున్నారని వినికిడి. ఉన్నది ఉన్నట్టుగానే తీయాలంటే తామెందుకు..?? అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నార్ట. మొత్తానికి తండ్రీ కొడుకుల ధాటికి ఇద్దరు దర్శకులు బలవుతున్నారు. అంతిమంగా ఈ రీమేక్ ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో? అది ఎవరి మీద పడుతుందో..?.