English | Telugu
మరోసారి వార్తల్లోకి మంచు విష్ణు.. ఏం చేశాడో తెలుసా?
Updated : May 3, 2025
ఇటీవలికాలంలో మంచు ఫ్యామిలీ పలు రకాల వివాదాలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వారి కుటుంబ వ్యవహారం ఒక సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు రావడం లేదు. ఇప్పుడు మంచు విష్ణుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కన్నప్ప సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న విష్ణు తను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కూడా బిజీగానే కనిపిస్తున్నాడు. తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని విద్య, నిత్యావసరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణ మారణకాండ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ ఆ కాల్పుల్లో మృతి చెందారు. దీంతో ఆ ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తోంది.
ఘటన తర్వాత మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాదు, జనసేన పార్టీ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తాజాగా హీరో మంచు విష్ణు మధుసూదన్ కుటుంబాన్ని కలిశారు. శుక్రవారం కావలిలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధుసూదన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మధుసూదన్ సతీమణి కామాక్షికి, వారి పిల్లలకు ధైర్యం చెప్పారు. పిల్లలను తాను దత్తత తీసుకొని వారి చదువుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు విష్ణు. తిరుపతిలో అనాథలను చేరదీసి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న విష్ణు.. ఇప్పుడు మధుసూదన్ కుటుంబాన్ని కూడా దత్తత తీసుకోవడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను చేస్తున్న ఈ మంచి పనులను ప్రశంసిస్తున్నారు.