English | Telugu
రజనీకాంత్ లింగ రివ్యూ
Updated : Dec 12, 2014
పెద్దింట్లో పెళ్లి భోజనం..! పిండి వంటలు, గారెలూ, బూరెలూ.. లేనిదంటూ లేదు. అన్ని రకాల రుచులూ ఉన్నాయ్. ఆరగించడానికి అంతా సిద్ధమే. కానీ వడ్డించే విస్తరే లేదు. ఎవరిక్కావలసిన వాళ్లు గిన్నెల్లోంచే తీసుకొని తినేయండి అని ఆర్డరేశారు.. - దాన్ని విందంటారా..? విస్తరే సరిగా లేకపోతే.. ఎన్ని పిండి వంటలు వండుకొన్నా ఏం లాభం..? లింగ సినిమా విషయంలోనూ అదే జరిగింది.
రజనీకాంత్ సినిమా. స్టార్లంతా ఉన్నారు. బాలీవుడ్ నుంచీ తీసుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యానికి కొదవ లేదు. రజనీ సినిమా అంటే పడిచావడానికి అభిమానులూ సిద్ధమే. కానీ.. కథేది? ఏ కథలో రజనీని చూపించాలి? మీక్కావలసిన డాన్సులూ, ఫైట్లూ, రజనీ మార్కు డైలాగులూ అన్నీ ఉన్నాయి.. ఎవరికి కావల్సింది వాళ్లు తీసుకోండి అంటే ఎలా ఉంటుంది..? దాన్ని రజనీ సినిమా అనాలా...??
లింగ కేవలం రజనీ ఫ్యాన్స్ కోసమే.. అని ఒట్టు పెట్టుకొని తీసినా బాగుణ్ణు. కనీసం రజనీ స్టైల్స్‌తో నింపేసినా బాగుణ్ణు. రజనీ ఫ్యాన్స్ అయినా సంతృప్తిపడుదురు. లింగని అన్ని వర్గాల ప్రేక్షకులనూ దృష్టి లో ఉంచుకొని, వాళ్లకు కావల్సిన కథలో రజనీ హంగుల్ని జోడించి తీస్తే.. అదిరిపోదును. కానీ ఇవి రెండూ ఈ సినిమా విషయంలో జరగలేదు..!
కథ విషయానికొస్తే - లింగ (రజనీ) ఓ దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసుకొంటూ.. సరదాగా గడిపేస్తుంటాడు. రాణి (అనుష్క) ఓ జర్నలిస్టు. లింగకో గతం ఉందని, అది తెలుసుకోవాలంటే తనతో పాటు తన ఊరు రావాలని లింగని అడుగుతుంది. లింగకు తన తాత (రజనీకాంత్) అంటే కోపం. తనకోసం చిల్లి గవ్వ మిగల్చలేదని బాధపడుతుంటాడు. తన తాత జ్ఞాపకాలున్న ఊరుకి రానంటేరానని మొండికేస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల లింగ తన సొంతూరు వెళ్తాడు. అక్కడ రాచమర్యాదలతో ఊరివాళ్లంతా లింగకు స్వాగతం పలుకుతారు. తాతయ్య (కె.విశ్వనాథ్) లింగకు తన పూర్వీకుల గురించి చెబుతాడు. లింగ తాతయ్య లింగేశ్వర (రజనీకాంత్) బ్రిటీష్ పాలనలో కలెక్టర్. పేరుకు కలెక్టర్ అయినా.. మహారాజు. లెక్కలేనంత ఆస్తులున్నాయి. బ్రిటీష్ వారిని ఎదిరించి ఓ డ్యామ్ కట్టడానికి పూనుకొంటాడు. తన ఆస్తినంతా ధారబోస్తాడు. ఉన్న ఆస్తినంతా హారతి కర్పూరం చేస్తాడు. అయితే ఏ ఊరి ప్రజల కోసం డ్యామ్ కట్టాడో, ఆ ఊరి ప్రజలే లింగేశ్వర్‌ని వెలి వేస్తారు. ఎందుకు? ఏమిటి? అసలు లింగేశ్వర్ కథేమిటి? తాతయ్య గురించి తెలుసుకొన్న లింగ ఎలా మారాడు? అనేదే ఈ సినిమా కథ.
చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ ఇది. బ్రిటీష్ పాలన, రాజులు, రాజ్యాలూ, ప్యాలస్, డామ్... ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ చూపించాలి. అందుకే దర్శకుడు కూడా మూడు గంటల నిడివి తీసుకొన్నాడు. పేద ప్రజల కోసం తన ఆస్తినంతా తెగనమ్మి... ఏమీ లేనివాడిగా బ్రతికే క్యారెక్టర్లు రజనీకి కొత్త కాదు. ఇవన్నీ ఎప్పుడో చేసేశాడు. మళ్లీ అలాంటి కథే ఎంచుకొన్నాడు. కాకపోతే ఈసారి బ్యాక్ గ్రౌండ్ మారింది. ఈసారి కథ డ్యామ్ కట్టడం అనే అంశం చుట్టూ తిరిగింది. అందులో రజనీ స్టైల్, భారీ ఎఫైట్లు, రెహమాన్ సంగీతం ఇవన్నీ చూపించి... విజువల్ ట్రీట్‌గా తెరపై ఆవిష్కరించాలనుకొన్నాడు దర్శకుడు. అయితే ఈ ప్రయత్నంలో ఏమాత్రం విజయం కాలేకపోయాడు. తెరపై ఎన్ని హంగులు చూపిస్తున్నా.. ఏదో తేడా కొడుతూనే ఉంటుంది. ఆ తేడా.. కథ, కథనాల్లో వైవిద్యం లేకపోవడమే. బ్రిటీష్ వారిని ఎదిరించి లింగ డ్యామ్ ఎలా కట్టాడు? దాన్ని మనవడు ఎలా కాపాడాడు అన్న లైన్‌తో మూడు గంటల పాటు ప్రేక్షకులను ఉతికి ఆరేశాడు. ఎమోషన్ సీన్స్ అక్కడక్కడ పండినా.. టోటల్‌గా సినిమాని నిలబెట్టలేకపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడం ఈ సినిమాకి ప్రధానమైన సమస్య. సంతానం కామెడీ ఫస్టాఫ్ లో అదీ అక్కడక్కడ వర్కువుట్ అయ్యింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అసలు వినోదానికే ఛాన్స్ లేదు. రజనీ తప్ప తెరపై మరో పాత్ర కనిపించలేదు. జగపతి బాబు ఉన్నా లేనట్టే. అనుష్కకి ఆంటీ లుక్స్ వచ్చేశాయి. సోనాక్షి వల్ల ఒరిగిందేం లేదు. చాలా సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. చిటికెలో తేల్చాల్సిన సీన్లు లాగి పెట్టి ప్రేక్షకుల్ని హింసించారు. క్లైమాక్స్ ఫైట్... రజనీ ఫ్యాన్స్‌కి నచ్చినా, మిగిలిన వాళ్లకు సిల్లీగా అనిపిస్తుంది.
రోబో తరవాత రజనీకాంత్‌ని పూర్తిస్థాయి చిత్రంలో చూసే అవకాశం కల్పించిన సినిమా ఇది. మధ్యలో కొచ్చడయాన్ వచ్చినా.. అది యానిమేషన్ కాబట్టి ఫ్యాన్స్ లెక్కలోకి తీసుకోరు. రజనీ ఫైట్స్, డాన్స్, స్టైల్స్, తన మార్కు డైలాగులతో రక్తికట్టించే ప్రయత్నం చేశాడు. రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించే అవకాశం వచ్చినా దర్శకుడు పెద్దగా ఉపయోగించుకోలేదు. తాత మనవడు క్యారెక్టర్లు సేమ్ టూ సేమ్. ఎమోషన్ సీన్స్‌లో రజనీ ఆకట్టుకొంటాడు. రిక్త హస్తాలతో ఊరు వదిలినప్పుడు, ఓ పూరి గుడెసెలో ఊరివాళ్లకు భోజనాలు వడ్డించేటప్పుడు.. ఇలాంటి సీన్స్‌లో రజనీ తన అనుభవాన్ని చూపించాడు. మొత్తానికి ఎప్పట్లా ఒంటిచేత్తో సినిమాని నడిపించేయాలని చూశాడు. కాకపోతే మిగిలిన విభాగాలు తనకు సరిగా సహకరించలేదు. అనుష్క బాగా లావయ్యింది. నిజానికి తనకీ అంత స్కోప్ లేదు. నా తొలి దక్షిణాది చిత్రం రజనీతో చేశా అని చెప్పుకోవడానికి తప్ప సోనాక్షికీ అంత సీన్ లేదు. సంతానం అక్కడక్కడ వేసిన జోకులు పేలాయి. జగపతిబాబుది నాలుగైదు సీన్ల పాత్రే. కాకపోతే విలన్ ఆయనే.
కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. క్వాలిటీ లేకపోతే ఎలా?? సంగీతం రెహమాన్ స్థాయిలో లేదు. పాత ట్యూన్లే మళ్లీ వినిపించాడు. ఒక్క క్యాచీ పాట కూడా కొట్టలేకపోయాడు. ట్రైన్ ఫైట్ ఎక్సలెంట్‌గా తీసిన విజువల్ పనితనం.. చివరి ఫైట్‌కి తుస్సుమంది. మూడు గంటల సినిమా ఎవరు భరిస్తారు? ఎంత రజనీ సినిమా అయినా షార్ప్‌గా ఉంటేనే చూస్తారు. సినిమా నిడివి అతి ప్రధాన మైనస్‌గా మారింది.
మీరు రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమాకి వెళ్లండి. కాకపోతే ఆ మాయాజాలం కూడా అక్కడక్కడ చూసే అవకాశం దక్కుతుందంతే! వీర ఫ్యాన్స్ అయితే మాత్రం ఎవాయిడ్ చేయండి. ఎందుకంటే ఓ గొప్ప స్టార్‌ని ఇంత సాదాసీదా కథలో చూడలేరు..
రేటింగ్ 2.25