English | Telugu
వి ఫర్ విక్టరీ... వి ఫర్ వివేకానంద.. వి ఫర్ వెంకటేష్!!
Updated : Dec 13, 2014
హీరో అన్నాక సినిమాల గురించి మాట్లాడతారు..
కాస్త ముదిరితే రాజకీయాల గురించి చెప్తారు..
సంపాదించే యాంగిల్ ఉంటే.. బిజినెస్ కబుర్లు బయటకు వస్తాయి..
లేదంటే క్రికెట్టూ, ఐపీఎల్లూ - సెల్ ఫోన్లూ, సెల్ఫీలూ... ఇలా నానా గోల!
కానీ వెంకటేష్ దగ్గర మాత్రం ఇవేం వినిపించవు. దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నా - సినిమాల గురించి చర్చించేది చాలా తక్కువే. ఆయనది ఓ ఆధ్యాత్మిక లోకం. ''ఈ సృష్టి అంతా మాయ..'' అంటూ వేదాంతిగా మారిపోతారాయన. తెరపై కనిపించే అల్లరి వెంకీలో ఓ వివేకానంద కూడా దాగున్నాడా?? అనే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. కాసేపు కూర్చుంటే చాలు. ఆయన మాటల 'మాయ' మొదలైపోతుంది. చావు పుట్టుకల గురించి చాలా లోతుగా మాట్లాడతారాయన. వాటి మధ్య మన బతుకు ఎలా సాగాలో కూడా విడమర్చి చెబుతారు. కోపం ఎలా అణచుకోవాలి? ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి..? దుఖానికి కారణం ఏమిటి?? ఇలాంటి విషయాలన్నీ విడమర్చి మరీ చెబుతుంటారు.
వెంకీ ఓ అగ్ర కథానాయకుడు. దశాబ్దాల పాటు ఆ స్థానంలో కొనసాగుతున్నారు. నిర్మాతలకు ఆయన కొంగు బంగారం. ఆయన సినిమా అంటే మినినమ్ గ్యారెంటీనే. దర్శకులకు ఆయన ది మోస్ట్ కంఫర్ట్ బుల్ హీరో. ఎలాంటి పాత్ర ఇచ్చినా దాని అంతు చూస్తారాయన. 'ఫలానా క్యారెక్టర్' అంటే చాలు. అందులో లీనమైపోతారు. క్లాస్, మాస్... చంటి, సుందరకాండ - గణేష్, సూర్యవంశం ఎక్కడా పొంతన పోలిక ఉండవు. అందుకే ఆయన వెరైటీ హీరో అయ్యారు. విక్టరీలు ఇంటికి తెచ్చుకొన్నారు. అయితే ఆయనలో ఓ వివేకానందుడూ అప్పుడప్పుడూ బయటకు వస్తుంటాడు.
ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారాయన. అందుకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు. రమణమహర్షి, వివేకానంద బోధనలు వెంకీని మరోదారిలో నడిపించాయి. అప్పుడప్పుడూ ఆయన మునులు, స్వాములతో గడుపుతుంటారట. వాళ్లని కలుసుకొని తన అనుమానాలను నివృత్తి చేసుకొంటుంటారట. అన్నట్టు రజనీకాంత్ లా హిమాలయాలకూ వెళ్లొచ్చారు. తెరపై ఎంతో సరదాగా కనిపించే వెంకీలో ఇన్ని లోతైన భావాలు ఉన్నాయని చెబితేగానీ అర్థం కావు.
వెంకీ ప్లానింగ్ కి తిరుగుండదు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారాయన. తాను నటించే ఏ సినిమాకైనా వెంకీ ఓ నిర్మాతగానూ ఆలోచిస్తారట. రూపాయి వృధాగా పోవడం ఆయనకు ఎంతమాత్రమూ ఇష్టముండదు. ''సంపాదించిన ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు చేయండి..'' అంటూ హీరోయిన్లకు టిప్స్ కూడా ఇస్తుంటారట. అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్ ఎలాగో వెంకీకి బాగా తెలుసు. పార్టీలూ, ఫంక్షన్లలో వెంకీని అరుదుగానే చూస్తుంటాం. వేదికలపై నాలుగు ముక్కలు తప్ప ఎక్కువగా మాట్లాడరు. తన సినిమాల గురించైనా సరే... ఎంత మాట్లాడాలో అంతే. నాగ్, చిరు, బాలయ్య... ఇలా అందరికీ కావల్సిన వాడే. ఈ తరంలో మహేష్, పవన్, ఎన్టీఆర్ ఇలా అందరితోనూ కలసిపోయేవాడే. అందుకే వెంకీ పరిశ్రమలో అజాత 'శత్రువు' అయ్యాడు. వెంకీ ఇలానే తన సినిమాలతోనేకాదు, మాటలతో, ఆధ్యాత్మక భావాలతోనూ మనల్ని ఇలానే 'ఎంటర్‌టైన్' చేయాలని.... మరిన్ని విజయాలతో దూసుకుపోవాలని.. మనస్ఫూర్తిగా కోరుకొందాం.. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే.. వెంకీ!!!
(ఈరోజు వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా)