English | Telugu

'ఖుషి' మూవీ రివ్యూ

'ఖుషి' మూవీ రివ్యూ

సినిమా పేరు: ఖుషి
తారాగణం: విజయ్ దేవరకొండ, సమంత, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, జయరామ్, రోహిణి, లక్ష్మి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, అలీ, శరణ్య ప్రదీప్ తదితరులు
సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్: మురళి జి.
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023 

విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్', సమంత గత చిత్రం 'శాకుంతలం' డిజాస్టర్స్ గా నిలిచాయి. అలాగే దర్శకుడు శివ నిర్వాణ గత చిత్రం 'టక్ జగదీష్' కూడా నేరుగా ఓటీటీలో విడుదలై పెద్దగా మెప్పించలేకపోయింది. అయినప్పటికీ ఈ ముగ్గురు కలిసి చేసిన 'ఖుషి' చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో ముగ్గురు మళ్లీ సక్సెస్ ట్రాక్ లొకి వస్తారనే అంచనాలు వ్యక్తమయ్యాయి. మరి 'ఖుషి' నిజంగానే ఆ అంచనాలను నిజం చేసి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
బిఎస్ఎన్ఎల్ లో జాబ్ తెచ్చుకున్న విప్లవ్(విజయ్ దేవరకొండ)కి తన సొంత ఊరు హైదరాబాద్ లో పోస్టింగ్ వస్తే.. మంచు ప్రదేశం, ప్రకృతితో మమేకం అంటూ పట్టుబట్టి మరీ కశ్మీర్ లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరాధ్య(సమంత)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తాను పాకిస్థానీ ముస్లిం అని ఆరాధ్య అబద్ధం చెప్పి నమ్మించినప్పటికీ.. తన ప్రేమకి మతాలు, దేశాలు అడ్డుకాదంటూ విప్లవ్ నిజాయితీగా ప్రేమిస్తాడు. విప్లవ్ ప్రేమని మెచ్చి ఆరాధ్య కూడా అతన్ని ప్రేమిస్తుంది. తాను అచ్చతెలుగు బ్రాహ్మణ అమ్మాయినని అసలు నిజం చెప్తుంది. అయితే వారి ప్రేమకి కులాలు, మతాలు, దేశాలు కాకుండా.. ఓ వింత సమస్య ఎదురవుతుంది. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం(సచిన్ ఖేడేకర్) నాస్తికుడు. శాస్త్రాలు లేవు, సైన్స్ మాత్రమే ఉందని బలంగా నమ్మే వ్యక్తి. ఇక ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాస్(మురళీ శర్మ) ప్రవచన కర్త. జాతకం చూసి జీవితాన్ని చెప్పేయగలడు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. చదరంగం శ్రీనివాస్ కూతురిని కోడలిగా చేసుకోవడానికి లెనిన్ సత్యం ఒప్పుకోడు. చదరంగం శ్రీనివాస్ కూడా అబ్బాయి, అమ్మాయి జాతకాల ప్రకారం పెళ్ళయితే వీరి మధ్య పలు సమస్యలు వస్తాయని చెబుతాడు. అలా పెద్దవారి ఇష్టానికి విరుద్ధంగా విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. మరి వారి వివాహ జీవితం ఎలా సాగింది? పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి? పిల్లల కోసం లెనిన్ సత్యం, చదరంగం శ్రీనివాస్ వారి సిద్ధాంతాలను పక్కన పెట్టారా? అనే మిగిలిన కథ.

విశ్లేషణ:
ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది. ఎందుకంటే ట్రైలర్ లోనే దాదాపు కథ మొత్తం చెప్పేశారు. దాంతో సినిమా చూస్తున్నప్పుడు తర్వాత ఏం జరగబోతుందనే అవగాహన మనకు కలుగుతుంది. క్లైమాక్స్ తప్ప దాదాపు సినిమా అంతా ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగానే నడుస్తుంది.

విప్లవ్ బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం తెచ్చుకొని కాశ్మీర్ వెళ్లే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కాశ్మీర్ అందాలు, సరదా సన్నివేశాలు, మంచి సంగీతంతో ప్రథమార్థం అందంగా సాగుతుంది. విప్లవ్-ఆరాధ్య మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. ఆరాధ్య ప్రేమ కోసం విప్లవ్ తపించడం, ఆమె ప్రేమని పొందడానికి చేసే పనులు ఆకట్టుకుంటాయి. అలా కాశ్మీర్ లో ఒకరినొకరు ఇష్టపడిన వారు.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. కానీ అసలు కథలోకి ప్రవేశించాక కథనంలో వేగం పెరగాల్సింది పోయి, ఇంకాస్త నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడా సరదా సన్నివేశాలు అలరించినప్పటికీ, ఒకానొక సమయంలో ఇంకెప్పుడు ఇంటర్వెల్ కార్డు పడుతుందనే అసహనం కూడా కలుగుతుంది.

ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ఎంతో స్కోప్ ఉంది. కానీ ఆ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయాడు. పెళ్లి తర్వాత విప్లవ్-ఆరాధ్య మధ్య వచ్చే సన్నివేశాలు, చిన్న చిన్న గొడవలు మొదట్లో బాగానే ఉన్నా, తర్వాత పదే పదే రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బలమైన సంఘర్షణ కనిపించదు. సినిమాని ముగించిన తీరు మాత్రం బాగుంది. పతాక సన్నివేశాలు మెప్పించాయి. చివరి 30 నిమిషాల్లో పలు సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. హేషామ్ అబ్దుల్ వహాబ్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకి తన వంతుగా ఎంత చేయగలడో అంత చేశాడు. సంగీతం తర్వాత సినిమాకి అంత ప్లస్ అంటే మురళి సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. సినిమాకో బ్యూటిఫుల్ లుక్ తీసుకొచ్చాడు. కాశ్మీర్ అందాలు కానీ, సీన్స్ లోని మూడ్ కి తగ్గట్లుగా పెట్టిన ఫ్రేమ్స్ కానీ మెప్పించాయి. ఎడిటర్ ప్రవీణ్ పూడి మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. షార్ప్ ఎడిటింగ్ తో నిడివిని కుదించి, సినిమాని మరింత బెటర్ గా ప్రజెంట్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
విప్లవ్ పాత్రలో విజయ్ చక్కగా ఒదిగిపోయాడు. పెళ్ళికి ముందు ప్రేమని గెలిపించుకోవడానికి, పెళ్లి తర్వాత ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి తపించే వ్యక్తిగా విజయ్ నటన ఆకట్టుకుంది. ఆరాధ్యగా సమంత కూడా మ్యాజిక్ చేసింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ తేలిపోయి.. చిన్మయి విలువని గుర్తు చేస్తుంది. నాస్తికుడు లెనిన్ సత్యంగా సచిన్ ఖేడేకర్, ప్రవచన కర్త చదరంగం శ్రీనివాస్ గా మురళీ శర్మ తమ సీనియారిటీతో పాత్రలను నిలబెట్టారు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణ ఉన్నంతలో బాగానే నవ్వించారు. జయరామ్, రోహిణి, లక్ష్మి, అలీ, శరణ్య ప్రదీప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
కథ కథనాల్లో కొత్తదనం లేనప్పటికీ కాస్త లవ్, కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త ఎమోషన్స్ కలగలిసి ఓవరాల్ గా సినిమా పరవాలేదు అనుకునేలా ఉంది. నెమ్మదిగా సాగే కథనం అక్కడక్కడా కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ.. విజయ్-సమంత నటన, సంగీతం, విజువల్స్, పలు అందమైన సన్నివేశాల కోసం ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఒకసారి చూసేయొచ్చు.

రేటింగ్: 2.75/5 

-గంగసాని