English | Telugu
సనాతన బానిసత్వాన్ని అంతం చేసే ఆయుధం ఇదే.. కమల్ సంచలన వ్యాఖ్యలు
Updated : Aug 4, 2025
విశ్వ కథానాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)జూన్ 5 న 'థగ్ లైఫ్'(Thug Life)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మణిరత్నం(Manirathnam) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన థగ్ లైఫ్, అన్ని భాషల్లోను భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకుంది. కానీ 'శక్తివేల్ నాయకర్' అనే గ్యాంగ్ స్టర్ క్యారక్టర్ లో కమల్ మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కమల్ చేతిలో ప్రస్తుతం భారతీయుడు పార్ట్ 3 మాత్రమే ఉంది.
కమల్ రీసెంట్ గా ప్రముఖ స్టార్ హీరో 'సూర్య'(Suriya)నిర్వహిస్తున్న 'అగరం ఫౌండేషన్'(Agaram Foundation)కి సంబంధించిన 15వ వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అగరం ఫౌండేషన్ ద్వారా ఉన్నత విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు 'నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. చట్టాన్ని మార్చడానికి కూడా విద్య మాత్రమే బలాన్ని ఇస్తుంది. ఈ యుద్ధంలో విద్య కేవలం ఒక ఆయుధం కాదు. అది దేశాన్ని చెక్కగల ఉలి. ఈ యుద్ధంలో గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుంది. మనం సమిష్టిగా కలిసి నిలబడాలి. అందుకు కేవలం విద్యను మాత్రమే గట్టిగా పట్టుకోవాలి. 2017లో ప్రారంభమైన ‘నీట్’(Neet)ఎంతో మందికి విద్యను దూరం చేసిందని చెప్పుకొచ్చాడు. కమల్ తన స్పీచ్ లో సనాతన ధర్మం అనే పదం వాడటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించి 2018 లో 'మక్కల్ నీది మయ్యం' అనే పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత వచ్చిన 2021 తమిళనాడు ఎన్నికలలో పోటీ చెయ్యగా ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కమల్ హాసన్ సైతం 'కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ' స్థానం నుంచి పోటీ చేసి 'బిజెపి' అభ్యర్థిని 'వానతి శ్రీనివాసన్' చేతిలో ఓడిపోయాడు. రీసెంట్ గా తమిళనాడురాష్ట్ర అధికారపార్టీ 'డిఎంకె' మద్దతుతో కమల్ రాజ్యసభకు ఎంపిక అయ్యాడు.