English | Telugu
కార్తీ... లోకల్ రాంబో
Updated : Oct 31, 2019
రాంబో సౌండ్ వినపడితే చాలు... ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎవరికైనా సిల్వెస్టర్ స్టాలోన్ గుర్తుకు వస్తాడు. అలాగే, మెషిన్ గన్ పట్టుకుని విలన్స్ మీద తూటాల వర్షం కురిపించే హీరోలను చూస్తే... రాంబో గుర్తుకు వస్తాడు. 'ఖైదీ' క్లైమాక్స్‌లో మెషిన్ గన్‌తో కార్తీని చుసిన ప్రేక్షకులకు రాంబో గుర్తుకు వచ్చాడు. అదే మాట అతడితో అంటే... 'నేను లోకల్ రాంబో' అని నవ్వేశాడు.
దీపావళికి విడుదలైన ఈ సినిమాకు తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా చాలా రోజుల తరవాత తెలుగులో కార్తీకి రియల్ సక్సెస్ వచ్చింది. దీనికి తోడు పలువురు హీరోలు, దర్శకులు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. దాంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. 'రవితేజగారు ఫోన్ చేసి ఖైదీ వంటి సినిమా చేయాలనుంది' అన్నారని కార్తీ చెప్పాడు.
'ఖైదీ'లో హీరోయిన్ లేదు, పాటలు లేవు, రొమాన్స్ లేదు, సపరేట్ కామెడీ ట్రాక్ లేదు. అయినా సినిమా హిట్టయ్యింది. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నిరూపించింది. దాంతో ప్రయోగాలు చేయడానికి కార్తీ సిద్ధమయ్యాడు. 'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ప్రకటించాడు. అయితే, విజయ్ హీరోగా ఓ సినిమా చేయడానికి 'ఖైదీ' దర్శకుడు లోకేష్ కనకరాజ్ సంతకం చేశాడు. ఆ సినిమా తర్వాత 'ఖైదీ 2' పట్టాలు ఎక్కుతుంది. 30 రోజుల్లో సీక్వెల్ షూటింగ్ ఫినిష్ చేస్తామని కార్తీతో నిర్మాత ఎస్.ఆర్. ప్రభు అంటున్నాడట.