English | Telugu
హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. సోషల్ మీడియాలో మొదలైన చర్చ!
Updated : Jun 21, 2025
ఈమధ్యకాలంలో ఏ సినిమాకీ లేనన్ని ట్విస్టులు హరిహర వీరమల్లు సినిమాకి కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఎన్నో గ్యాప్‌ల మధ్య షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. కానీ, ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేస్తూ రావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతోందా అనిపిస్తోంది. అనేక సార్లు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి చివరికి జూన్ 12 అన్నారు. కానీ, ఆ డేట్‌కి కూడా రిలీజ్ చెయ్యలేకపోయారు. ఇప్పుడు మరో కొత్త డేట్‌తో వచ్చారు. అది జూలై 24.
హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కాబోతోందని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీ సంస్థలే. సినిమా రిలీజ్ డేట్‌లను ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దానికి హరిహర వీరమల్లు కూడా మినహాయింపు కాదు అని తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. అయితే ఓటీటీలపై నిర్మాతలు ఆధార పడడంలో తప్పులేదు. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం గురించి ముందుగానే చెప్పలేరు. అదే ఓటీటీకి రైట్స్ ఇచ్చేస్తే పెద్ద ఎమౌంట్ నిర్మాతల కంటికి కనిపిస్తుంది. దాంతో వారు చెప్పినట్టుగానే నిర్మాతలు నడుచుకోవాల్సి వస్తోంది.
ఇక విజయ్ దేవరకొండ సినిమా కింగ్‌డమ్ పరిస్థితి కూడా అదే. ఈ సినిమా రిలీజ్ కూడా అనేక సార్లు వాయిదా పడింది. తాజా రిలీజ్ డేట్ కోసం ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చే వారం ప్రకటిస్తారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు, కింగ్‌డమ్.. ఈ రెండు సినిమాలు జూలై 25న ఒకేరోజు రిలీజ్ అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే రిలీజ్ డేట్స్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తే గానీ క్లారిటీ రాదు అని అంతా అనుకున్నారు. హరిహర వీరమల్లు డేట్ వచ్చేసింది. ఇప్పుడు కింగ్‌డమ్ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి, తమ సినిమాకి మధ్య ఒక వారం గ్యాప్ ఉంటే బాగుంటుందని కింగ్‌డమ్ నిర్మాతలు భావిస్తున్నారు. కానీ, అలా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఒకే వారంలో రెండు రోజుల గ్యాప్ రిలీజ్ చేసే చాన్స్ ఉందని సమాచారం. ఇప్పటికే హరిహర వీరమల్లు ప్రమోషన్ కొంత చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రమోషన్ మరింత స్పీడప్ చేస్తారు. అయితే ఇప్పటికే అనేకసార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దాంతో ప్రేక్షకుల్లో సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకం లేనట్టుగా కనిపిస్తోంది. కొత్త పోస్టర్ వచ్చినప్పటికీ దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
