English | Telugu

రాజమౌళికి పెద్ద టార్గెట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి!

గత కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోయిన నంది అవార్డులను గద్దర్‌ అవార్డులు పేరుతో పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. సినీ పరిశ్రమ, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గద్దర్‌ అవార్డుల సంరంభం జూన్‌ 14న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం ఎంతో ఆసక్తికరంగా సాగింది. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్‌ని మించే స్థాయిలో అభివృద్ధి చెందాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.

‘1964లో అంటే 60 ఏళ్ళ క్రితం తెలుగు చిత్ర పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ సంవత్సరమే నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించింది. ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్న తొలి నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. మొదటి తరం నటులు అన్న నందమూరి తారక రామారావుగారు, డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావుగారు, రెండవ తరం కృష్ణగారు, శోభన్‌బాబుగారు, కృష్ణంరాజుగారు, మూడవ తరం చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు, వెంకటేష్‌ గైరెలాంటి హీరోలు వచ్చారు. ఈరోజు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉంది. నాలుగో తరంలో పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటివారు ఉన్నారు.

చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది మిత్రులతో నాకు విద్యార్థి దశ నుంచే పరిచయం ఉంది. వాళ్లంతా ఇప్పుడు ఇండస్ట్రీలో రాణించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బన్నీ కావచ్చు, వెంకట్‌ కావచ్చు, అశ్వినీదత్‌ గారి అమ్మాయిలు, వాళ్ల అల్లుడు, వీళ్లందరూ యంగ్‌ ఏజ్‌లో, కాలేజ్‌ డేస్‌ నుంచి నాకు తెలుసు. ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా, నటులుగా, నిర్మాతలుగా, టెక్నీషియన్లుగా మా యువ మిత్రులు అందరూ ఈ సినీ పరిశ్రమలో రాణించడం, ఈ రోజు వారందరినీ వేదికపై అభినందించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్‌ 2047 గురించి చెబుతున్నా. ఫిలిం ఇండస్ట్రీ కూడా దేశంలో ఒక ప్రముఖ ఇండస్ట్రీగా, దేశ అభివృద్ధికి పాటుపడాలని మా ప్రణాళిక. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట స్పష్టంగా చెప్పదలచుకున్నాను. 2047 నాటికి ట్రిలియన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా నిలబడాలనేది ప్రణాళిక. హాలీవుడ్‌ అంటే అమెరికా అంటాం, బాలీవుడ్‌ అంటే ముంబాయి అంటాం. నేను మిత్రుడు రాజమౌళిని అడుగుతున్నాను, మీరు వాటిని ఈ గడ్డకు తీసుకురండి. దానికి మీకు ఏం కావాలో చెప్పండి. అన్ని విధాలుగా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. అన్ని ఇండస్ట్రీల్లాగానే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమైంది. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్‌ ఇస్తాం. దాన్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, పెద్దలకు ఉంది. మరో 22 సంవత్సరాలు నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాను. ఏ హోదాలో ఉన్నా మీకు నేను అండగా ఉంటాను’ అన్నారు.