English | Telugu
తెలుగునాట 'లియో' బుకింగ్స్ కి ఊహించని రెస్పాన్స్!
Updated : Oct 16, 2023
కొంతకాలంగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు మారుమోగిపోతోంది. ఇప్పటిదాకా అతను డైరెక్ట్ చేసిన సినిమాలు విడుదలైంది నాలుగే కానీ అతని క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటన తర్వాత తెలుగునాట కూడా అతని సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ యూనివర్స్ లో 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలు రాగా రెండూ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా గతేడాది వచ్చిన 'విక్రమ్' సంచలన వసూళ్ళతో తమిళనాట ఎన్నో రికార్డులు సృష్టించింది. తెలుగునాట కూడా భారీ లాభాలతో సత్తా చాటింది. అందుకే 'విక్రమ్' తర్వాత లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న 'లియో'పై తెలుగునాట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇది 'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత లోకేష్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా కావడం విశేషం.
విజయ్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'లియో'. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో అన్ని చోట్లా బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ లో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ తోనే 1 మిలియన్ మార్క్ అందుకుంది. తమిళనాడు, ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తుంటే రికార్డు ఓపెనింగ్స్ ఖాయమనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లియో జోరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. 'విక్రమ్', 'మాస్టర్' సినిమాల ప్రభావంతో హైదరాబాద్ లో లియోకి స్ట్రాంగ్ బుకింగ్స్ ఉంటాయేమో అని భావిస్తే.. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇలా పలు మేజర్ సిటీల్లో బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లియో బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. తెలుగునాట విజయ్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడంతో పాటు.. ఫుల్ రన్ లో విక్రమ్ కి మించిన సంచలనాలు సృష్టించేలా ఉంది.