English | Telugu
‘అనేకుడు’... ఎవడే అతగాడు?
Updated : Jan 17, 2015
తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ సినిమాలకి తమిళనాడులో మంచి మార్కెట్ వుంది. ఈమధ్య కాలంలో హిందీలో కూడా ఎంటరైన ధనుష్ అక్కడ కూడా తన హవా నడిపిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం ధనుష్‌ని మొన్నటి వరకూ పట్టించుకున్నోళ్ళే లేరు. అసలు ధనుష్‌ని హీరో మెటీరియల్‌గా తెలుగువాళ్ళు గుర్తించలేదు. అయితే ఈమధ్య విడుదలైన ‘రఘువరన్ బీటెక్’ సినిమా తర్వాత ధనుష్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. దీంతో తమిళంలో ధనుష్‌తో సినిమాలు తీస్తున్న వాళ్ళందరూ తెలుగు మార్కెట్ కూడా తమకు ప్లస్సవుతుందని మురిసిపోతున్నారు. ‘రంగం’ దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఇప్పుడు తమిళంలో ‘అనేకన్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో స్లిప్ పర్సనాలిటీ లాంటి కొత్త తరహా కాన్సెప్ట్ ఏదో వర్కవుట్ చేసినట్టున్నారు. ఒక్క మనిషి అనేకమందిలా వుంటే ఎలా వుంటుందనో, ఒక్క మనిషిలోనే అనేకమంది వుంటే ఏమవుతుందనో ఈ సినిమా ప్రధాన పాయింట్. ఈ సినిమాని తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. దానికి ‘అనేకుడు’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ అర్థం పర్థం లేకుండా తమిళ వాసన కొడుతున్నప్పటికీ, సినిమా బాగుంటే జనం టైటిల్ ఎలా వున్నా పట్టించుకోరనే నమ్మకంలో నిర్మాతలు ఉన్నట్టున్నారు. నిజమే, సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిన్న విషయాలను ఎందుకు పట్టించుకుంటారు? సరే, త్వరలో ‘అనేకుడు’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా వుంటే, ధనుష్ సినిమా తెలుగులో విజయం సాధించడంతో గతంలో తమిళంలో ధనుష్ హిట్ సినిమాలను కూడా డబ్బింగ్ చేసి వదలాలని ఆయా సినిమాల నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. హిట్ సినిమాల నిర్మాతలతోపాటు ఫట్టయిన సినిమాల నిర్మాతలు కూడా సమాధుల్లో వున్న తమ సినిమాల ప్రింట్లను దులిపి డబ్బింగ్ చేయాలని చూస్తున్నారట.