English | Telugu
శ్రీకాంత్ పై మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. షాక్ తప్పదా?
Updated : Oct 12, 2025
మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కొందరు ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఆయన నటించిన 'అరి' సినిమా పోస్టర్లని చించివేశారు. ఇప్పటికే శ్రీకాంత్ అయ్యంగార్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తాజాగా మా అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. మా అధ్యక్షులు మంచు విష్ణుని కలిసి జాతిపిత మహాత్మా గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని, అతని 'మా' సభ్యత్వం రద్దు చేయాలని కోరారు.
ఫిర్యాదు అనంతరం బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. "నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశాం. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెడుతున్నాడు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం. మా అసోసియేషన్ శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. సినిమా పెద్దలను కోరుతున్నాను.. మీరు దీనిపై స్పందించాలి. ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి." అని అన్నారు.
శ్రీకాంత్ అయ్యంగార్ పై బల్మూరి వెంకట్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందించారు. "ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యింది. మాకు డిస్ప్లినరీ కమిటీ ఉంది.. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా కమిటీ మీటింగ్ పెట్టి.. త్వరలోనే చర్యలు తీసుకుంటాం." అన్నారు.
కొంతకాలంగా శ్రీకాంత్ అయ్యంగార్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారు. ముఖ్యంగా గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో దారుణ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యతిరేకత, ఫిర్యాదుల నేపథ్యంలోనైనా శ్రీకాంత్ అయ్యంగార్ వెనక్కి తగ్గుతారేమో చూడాలి.