English | Telugu
దర్శకులకు తలనొప్పిగా మారిన చిరు, నాగ్
Updated : Oct 12, 2014
వారసుల సినిమా అంటే దర్శకులు హడలిపోతున్నారు. అభిమానుల అంచనాలు, హీరో ఇమేజ్‌కి తగిన కథల్ని ఎంచుకోవడాలూ.. ఇవేం వాళ్లకు సమస్యలుగా మారడం లేదు. హీరో తండ్రుల అధిక జోక్యం.. దర్శకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్‌తో సినిమా అంటే దర్శకులకు కొత్త టెన్షన్‌లు పుట్టుకొస్తొంది. చరణ్ కథల్లో చిరు జోక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ, హీరోయిన్, సంగీతం, ఇతర టెక్నీషియన్ల ఎంపిక.. వీటిలో చిరు జోక్యం చేసుకోవడం పరిపాటే. రచ్చ సమయంలో దర్శకుడు సంపత్‌నందిని పూర్తిగా పక్కన పెట్టి... సొంత నిర్ణయాలు తీసుకొన్నారు చిరు, చరణ్‌లు. సంతప్ కొత్త దర్శకుడు, ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే.. అనుకోవచ్చు. మరి ఎన్నో సినిమాల అనుభవం సంపాదించుకొన్న కృష్ణవంశీదీ అదే పరిస్థితి కదా..?? గోవిందుడులో చిరు కెలుకుడు ఓ స్థాయిలో సాగింది. క్లైమాక్స్‌ని కూడా మార్చేసి, చిరు సొంత తెలివి తేటలు చూపించారు. ఆ సినిమా కాస్తో కూస్తో నిలబడింది కాబట్టి.. అంతా ఓకే అనిపిస్తోంది. అదే ఫలితం రివర్స్ అయితే ఇదంతా దర్శకుడి తప్పని చిరు గ్యాంగ్, చిరు జోక్యం వల్లే తాను అనుకొన్న సినిమాని అనుకొన్నట్టుగా తీయలేకపోయానని కృష్ణవంశీ... తెర వెనుక ఎన్ని గొడవలు పడేవాళ్లో..! మొత్తానికి గోవిందుడు అందరి వాడేలే సినిమా వచ్చేసింది. ఇక ఆ గొడవ లేదు.
ఇప్పుడు మరో సీరియర్ హీరో నాగార్జున కూడా ఇలాంటి తలనొప్పులే సృష్టిస్తున్నాడు. తన ఇంట్లో ఇద్దరు వారసులున్నారు. నాగచైతన్య, అఖిల్.చైతూ సినిమాల్లో నాగ్ ప్రమేయం తప్పనిసరి. తాజాగా ఒక లైలా షూటింగ్ కూడా నాగ్ కనుసన్నల్లో సాగింది. నాగ్ ఈ సినిమా మొత్తం చూసి కొన్ని మార్పులు చెప్పారట. దానికి అనుగుణంగా కొంతమేర రీషూట్ కూడా సాగింది. ఇప్పుడు అఖిల్ రాబోతున్నాడు. అఖిల్ కోసం దర్శకులు కథలు రెడీ చేసుకోవడం, నాగ్‌కి వినిపించడం, ఆయన రిజక్ట్ చేయడం.. ప్రతీరోజూ ఇదే తంతు. కథల విషంయలో పూర్తిగా అఖిల్‌దే బాధ్యత.. అన్నీ తనే చూసుకొంటున్నాడు అని నాగ్ అంటున్నా.. నాగ్‌కి అనుమతి లేనిదే అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టే ధైర్యం ఏ దర్శకుడికీ లేదు. ఇప్పుడీ ప్రాజెక్టు వినాయక్ చేతిలో పడింది.
వినాయక్ అనుభవం గురించీ, కెపబులిటీ గురించి చెప్పవలసిన అవసరం లేదు. అయినా సరే.. నాగ్ ఏమాత్రం అలుసు ఇవ్వడం లేదు. కథపై వినాయక్‌తో విస్ర్కృతంగా చర్చలు జరుపుతూనే ఉన్నాడు నాగ్. అఖిల్ - వినాయక్‌ల కాంబో దాదాపుగా కన్‌ఫామ్ అయినా ఈ విషయంలో నాగ్, అఖిల్ పెదవి విప్పడం లేదు. దానికి కారణం... ఈ కథ పూర్తిగా వారిద్దరికీ నచ్చకపోవడమే. నాగ్ సూచనల మేరకు వినాయక్ కథలో మార్పులు చేసుకొంటూ పోతున్నాడట. నాగ్ ఓకే చెప్పేంత వరకూ ఈ సినిమా సెట్స్‌పై వెళ్లదు. అంతేకాదు... కథానాయిక విషయంలోనూ నాగార్జునదే అంతిమ తీర్పని తెలిసింది. జోష్ విషయంలో పూర్తి బాధ్యతలు దిల్‌రాజుకి అప్పగించాడు నాగ్. ఎందుంకటే అప్పటికి రాజుగారు మాంఛి ఫామ్‌లో ఉన్నారు. ఆయన పట్టిందల్లా బంగారమే. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. చైతూ ఎంట్రీ ఫిల్మ్ ఘోరంగా దెబ్బతింది. అందుకే అఖిల్ విషయంలో ఎలాంటి పొరపాట్లూ జరక్కుండా జాగ్రత్త పడుతున్నాడు నాగార్జున. తొలి సినిమా వరకూ ఈ ముందు జాగ్రత్తలు, కథలో జోక్యాలూ చల్తా. ఆ తరవాత కూడా కూడా ఇదే రకంగా చేతులూ, కాళ్లూ పెడతానంటే... రామ్‌చరణ్, అఖిల్, నాగచైతన్య పేర్లు చెబితే దర్శక నిర్మాతలు ఝడుసుకొనే ప్రమాదం ఉంది.