English | Telugu
బ్రదరాఫ్ బొమ్మాళీ రివ్యూ: ఎందుకీ కంగాళీ
Updated : Nov 7, 2014
''ఇది పులిహోర కథన్నమాట..''
ఈ డైలాగ్‌ని బ్రహ్మానందం చేత, నరేష్ చేత రెండు మూడు సార్లు చెప్పించారు ఈ సినిమాలో!
దాన్ని మేం కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వాడేసుకొంటున్నాం!
యస్... బ్రదరాఫ్ బొమ్మాళీ ఓ పులిహోర కథ.
పండగనాడు వండుకొన్న పులిహోర అయితే ఆవురావురమంటూ తినేయొచ్చు. పండగ అయిపోయిన పది రోజులకు అదే పులిహోర తింటే వాంతొచ్చి, వికారమేసి, పది రోజుల మంచం పడతారు.
ఈ సినిమా పదేళ్ల క్రితం తీసుంటే - దర్శకుడినీ, నిర్మాతనీ, ఇలాంటి కొత్త కథ ఎంచుకొన్న నరేష్‌కి పూల దండలు వేసి, సన్మానించేవాళ్లం. కాకపోతే పదేళ్ల నుంచీ జనం ఇదే కథని మార్చి మార్చి, తిప్పి తిప్పి చూస్తున్నారు. నాకూ కథల్లేవ్, నవ్వించడానికి ఇంకో మార్గం లేదన్నట్టు నరేష్ కూడా అదే పాత చింతకాయ్ పచ్చడికి కాస్త కోటింగ్ ఇచ్చి తీశాడు. ఆ సినిమానే బ్రదరాఫ్ బొమ్మాళీ.
రామకృష్ణ (నరేష్) లక్కీ (కార్తీక) ఇద్దరూ కవలలు. రామకృష్ణ సాఫ్ట్‌గా ఉంటూ.. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసుకొంటుంటాడు. ఎవ్వరి జోలికీ వెళ్లడు. కానీ లక్కీ అలా కాదు. తాను హార్డ్ వేర్. నోటితో కాదు, చేత్తో బదులు చెబుతుంది. ఊర్లోకి వెళ్లి గొడవలు పెట్టుకొస్తుంది. ఓసారి గుళ్లో శ్రుతి (మోనాల్ గజ్జర్)ని చూసి మనసు పడతాడు రామకృష్ణ. తానూ.. రామకృష్ణ పనిచేసే కంపెనీలోనే జాయిన్ అవుతుంది. ఏదోలా అష్టకష్టాలూ పడి ఆమె మనసు గెలుచుకొంటాడు. తీరా పెళ్లి చేసుకొందామంటే నాన్న (కాశీవిశ్వనాథ్) పెట్టిన షరతు గుర్తొస్తుంది. చెల్లికి పెళ్లి చేస్తే తప్ప.. అన్నయ్య పెళ్లి చేసుకోకూడదన్నమాట. చెల్లాయికి ఎన్ని సంబంధాలు చూసినా వాళ్ల తుక్కు రేగ్గొట్టి పంపుతుంటుంది. చివరికో షాకింగ్ న్యూస్ ఏంటంటే... లక్కీ ఓ అబ్బాయిని (హర్షవర్థన్)ని ప్రేమిస్తుంది. అప్పటికే ఆ హర్షకి ఫ్యాక్షనిస్ట్ కూతురితో పెళ్లి కుదురుతుంది. ఆపెళ్లిని చెడగొట్టి, హర్షని తన చెల్లాయికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు రామకృష్ణ. మరి ఈ ప్రయాణం ఎలా సాగింది? చివరకు ఏమైంది? అనేదే బ్రదరాఫ్ బొమ్మాళీ కథ.
ఢీ, రెడీ... ఇలాంటి కథల ఫార్మెట్‌లో సాగే సినిమా ఇది. విలన్ ఇంట్లో హీరో వెళ్లి, అక్కడ తిష్ట వేసుకొని చేసే హంగామా ఈ కథ. కొత్తదనం ఏంటంటే... ఈసినిమాని నరేష్ చేయడం, కార్తీక పాత్ర కాస్త కొత్తగా ఉండడం. వీటిని మినహాయించి చూస్తే.. బ్రదరాఫ్ బొమ్మాళీ శూన్యం.
తొలి సగం ఏవో కొన్ని సరదా సన్నివేశాలతో లాగించేశారు. పంచ్‌లు అక్కడక్కడా పేలడంతో ఓకే అనిపిస్తుంది. ఇంట్రవెల్ కార్డు పడ్డాక - ఈ కథ ఎక్కడికి వెళ్తుందో, స్ర్కీన్‌ప్లే మలుపులేమిటో సగటు ప్రేక్షకుడు ఈజీగా ఊహించేస్తాడు. ఇక్కడ మాటల రచయిత, దర్శకుడు పనితనం కనిపించాలి. ఇవి రెండూ మోసిన చిన్ని కృష్ణ హ్యాండ్సప్ అంటూ చేతులు ఎత్తేశాడు. దాంతో బొమ్మాళీ కాస్త కంగాళీగా మారింది. పాత్రలన్నీ ఒకే చోట చేరడంతో ఏ పాత్రపైనా ఫోకస్ పెట్టలేదు. డైలాగులు, పంచ్‌లూ పంచుకొంటూ పోవడంతో.. ఎవ్వరూ తెరపై ఆనలేదు. ఇంట్రవెల్ తరవాత రెండే రెండు సీన్స్‌తో ఈ సినిమాని ముగించేయొచ్చు. కానీ 30 సన్నివేశాలు రాసుకొన్నాడు. ప్రతీ సీన్‌లోనూ ఒక్కటే మేటర్ కనిపిస్తుంది. ప్రతినాయకుల్ని, బ్రహ్మానందాన్ని బఫూన్లని చేసి ఆడుకోవడం. ఇప్పటికే ఇవి చూసీ చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకుడికి, చూసిన సన్నివేశమే మళ్లీ మళ్లీ చూపిస్తే బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది..??
నరేష్ యధావిధిగా తన ఎనర్జీతో సినిమాని పండించాడు. తన టైమింగ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో నరేష్ కూడా డమ్మీగా మారిపోయి.. గుంపులో గోవిందయ్యగా తయారయ్యాడు. కార్తీకకు ఇది కొత్త పాత్రే. తన హైట్ బాగా కలిసొచ్చింది. డాన్సుల్లో కష్టపడింది. కొన్ని మంచి మూమెంట్స్ చేసింది. ఆడపిల్లలా నటించాల్సినప్పుడు మాత్రం.. ఇమడలేదు. కోన వెంకట్‌గా బ్రహ్మీది పరమ రొటీన్ పాత్ర. ఏదో రెండు మూడు పంచ్‌లతో తానూ లాగించే ప్రయత్నం చేశాడు. మోనాల్ గజ్జర్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కనిపెట్టాలంటే మీ తల ప్రాణం తోకకు రావడం ఖాయం. మిగిలిన పాత్రల లిస్టు చాలానే ఉంది. కానీ.. వాళ్ల ప్రతిభ పూర్తిస్థాయిలో బయటపెట్టడానికి అవకాశమే లేదు.
పాటలు తక్కువ పెట్టి మంచి పని చేశారు. నిడివి కూడా తక్కువే. సో.. ఆ రకంగా తీసుకొన్న ప్రయత్నాలు ఈ సినిమాకి కాస్త కలిసొచ్చాయి. శేఖర్ చంద్ర పాటల్లో ఇండ్రడక్షన్ గీతం ఒక్కటే ఆకట్టుకొంటుంది. మిగిలిన వన్నీ.. వేస్టే. సినిమా కాస్త రిచ్‌గా తీయాలన్న తపన కనిపించింది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. ఇదో రొటీన్ కామెడీ సినిమా. కొన్ని పంచ్‌ల కోసం చూడొచ్చు. అంతకు మించి ఏం ఆశించకండి.
రేటింగ్: 2/5