English | Telugu

జోరు రివ్యూ: ఇది జీరో గేరు

కామెడీ సీన్ చూస్తుంటే ఏడుపొస్తుంటే..
రొమాన్స్‌కి ఒంటిపై తేళ్లు పాకుతుంటే
సెంటిమెంట్ పండించిన‌ప్పుడు త‌ల గోడ‌కేసిబాదుకోవాల‌నిపిస్తే
టోట‌ల్‌గా టికెట్టు కొన్న పాపానికి మ‌న‌పై మ‌న‌కే జాలేస్తే... ఆ సినిమా బోరు.. సారీ జోరు!!

ఎట‌మ్ టూ మ‌ర్డ‌రంటే క‌త్తి ప‌ట్టుకొని చంపేస్తా అంటూ బెదిరించ‌డం ఒక్క‌టే కాదు. ఇలాంటి సినిమాల్ని చూపించ‌డం కూడా. హింసాత్మ‌క స‌న్నివేశాలంటే... ర‌క్తం చూపించ‌డం ఒక్క‌టే కాదు. వినోదంలోనూ ఇంత హింస ఉంటుంద‌ని నిరూపించిన చిత్ర‌మిది. ఎవ‌రైనా ప్రాణం పెట్టి సినిమా తీశా అంటారు, ప్రాణాలు తీయ‌డానికి సినిమా తీస్తే ఎలా ఉంటుందో నిరూపించ‌డానికి తీసిన సినిమా.. జోరు!!

ఇది మ‌రీ టూమ‌చ్ అండీ.. సినిమాల్ని ఇలాంటి రివ్యూల‌తో చంపేస్తారా ఏంటి?? అని సినిమాల‌పై జాలి చూపించేవాళ్లెవ‌రైనా జోరు ఒక్క‌సారి చూడండి. పైనున్న ప్ర‌తీ అక్ష‌రం, ప‌ర‌మ‌స‌త్యం అనిపిస్తుంది. మ‌రింత‌కీ ఈ జోరులో ఏముందో చూద్దామా..??

సందీప్ (సందీప్ కిషన్) ది వైజాగ్‌. హుషారైన కుర్రాడు. త‌న‌కు ఇద్ద‌రు అమ్మ‌లు, ఇద్ద‌రు నాన్న‌లు. (అదెలాగో తెలియాలంటే ఇప్పుడు చెప్ప‌డం క‌ష్టం.. సినిమా చూస్తే అర్థం కావ‌చ్చు). ఓ రోజు త‌న‌కు సంబంధం లేని విష‌యంలో త‌ల దూర్చి, భవానీ (అజయ్) తో గొడవ పడతాడు. ఎవ‌రితో ప‌డితే వాళ్ల‌తో గొడ‌వ పెట్టుకొంటావా?? అని ఇంట్లో వాళ్లు నిల‌దీస్తే.. వాళ్ల‌పై అలిగి, . హైద‌రాబాద్ బ‌య‌ల్దేర‌తాడు. స‌రిగ్గా ఆస‌మ‌యంలోనే అను (రాశి ఖన్నా) వైజాగ్ నుంచి హైద‌రాబాద్ వెళ్తుంటుంది. త‌నెవ‌రో కాదు సదాశివం(షియాజీ షిండే) కూతురు. ప‌ద్దెనిమిదియేళ్ల త‌ర‌వాత తండ్రిని క‌ల‌వ‌డానికి వ‌స్తుంది. సందీప్, అనూ ఒకే కార్లో ప్ర‌యాణం చేస్తారు. దార్లో సందీప్‌, అనుల‌పై ఎటాక్ జ‌రుగుతుంది. అనుపై హ‌త్యా ప్ర‌య‌త్నం చేస్తారెవ‌రో. వాళ్లెవ‌రో కాదు... భ‌వానీనే. అస‌లు భ‌వానీకీ, అనుకీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ మ‌ర్డ‌ర్ ఎటెమ్ట్ ఎందుకు చేశారు? ఈ క‌థ‌కీ పీకె (పెళ్లి కొడుకు)కీ ఉన్న లింకేంటి? అనేదే.... ఈ సినిమా.

పాపుల్ని నర‌కంలో నూనెలో వేగిస్తార‌ట‌, రంపంతో కోస్తార‌ట‌, సూదుల‌తో ఒళ్లంతా గుచ్చుతార‌ట‌.. ఈ అట అట‌లు ఎందుక‌ట‌..? ఒక్క‌సారి జోరు చూస్తే ఆ ఫీలింగ్స‌న్నీ క‌ట్ట‌క‌ట్టుకొని క‌నిపించేస్తాయి. ప్ర‌తీ సీనూ ఓ ఆణిముత్య‌మే. ప్రేక్ష‌కుల‌పై ప‌గ ప‌డితే త‌ప్ప‌, ఏ ద‌ర్శ‌కుడికీ ఇలాంటి స‌న్నివేశాలతో ఓ సినిమా తెర‌కెక్కించాల‌న్న కోరిక రాదు. నా బ్లాక్ మ‌నీ ఇన్‌కం టాక్స్ రైడింగ్‌లో పోయాయ‌నుకొంటా అనుకొంటే త‌ప్ప ఏ నిర్మాతా ఇలాంటి సినిమాపై డ‌బ్బులు పెట్ట‌డు. నాలోని ప‌ర‌మ చెత్త న‌టుడిని ఓసారి చూసుకొంటా అని ఫిక్స‌యితే త‌ప్ప ఏ హీరో ఇలాంటి క‌థ చేయ‌డు. న‌న్ను వ‌దిలేయండ్రోయ్ దండం పెడ‌తా... అనిపించుకోద‌గ్గ సీన్లు ఈ సినిమాలో క‌నీసం డ‌జ‌ను ఉన్నాయి. అందులో స‌ప్త‌గిరి, ఎలుగుబంటిపై తెర‌కెక్కించిన సీన్ వ‌ర‌స్ట్‌లో ఎవ‌రెస్టు. వామ్మో.. ఆ సీన్‌ని వ‌రుస‌గా నాలుగైదు సార్లు చూపిస్తే, ఎవ్వ‌రికైనా ఇకారంతో కూడిన జ్వ‌రంతో నిండిన ఓ రొక‌మైన రోగం వ‌చ్చేస్తుంది. త‌ల‌పోటు ఉన్న‌వాడ్ని రోక‌లిపోటు వేసిన‌ట్టు.. సెప్టిక్ ట్యాంక్ కామెడీ ఒక‌టి. ఇది వర‌స్ట్ సీనా, ఇది వ‌ర‌స్ట్ సీనా అని బేరీజు వేసుకొంటే ఈ సినిమాలో అన్ని సీన్లూ పోటీ ప‌డ‌తాయి. ఇంకెం చెప్ప‌గ‌లం ఈ క‌ళాఖండం గురించి..??

బ్ర‌హ్మానందం... ఈ పేరునీ, ఆయ‌న ఫేమునీ వాడుకోవాల‌ని చూసిన మ‌రో సినిమా ఇది. అయితే ఆ పాత్ర కూడా 33 ప‌ల్టీలు కొట్టింది. ఆయ‌నెప్పుడూ ప్రేక్ష‌కులని చూసి మాట్లాడుతుంటాడు. `నాకీ ఖ‌ర్మ ఏంట్రా బాబు`అని. అచ్చంగా ఆడియ‌న్స్‌దీ అదే ఫీలింగ్‌. ఈ సినిమాలో ప్రేక్ష‌కుల్ని ఉత్సాహ‌ప‌రిచేవి, ఆనందించేవి, హ‌మ్మ‌య్య అనుకొనేవి రెండే రెండు..స‌
1. విశ్రాంతి కార్డు
2. శుభం కార్డు..

సందీప్ కిష‌న్ చేయ‌ద‌గిన సినిమా కాదిది. ఫ‌స్ట్ టైమ్ ఓ చెత్త క‌థ‌ను ఎంచుకొన్నాడు. తాను చేసిందేం లేదు. వోవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డం త‌ప్ప‌. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా... వాళ్ల‌నుంచి ఏం ఆశించ‌లేం. బ్ర‌హ్మానందం, స‌ప్త‌గిరి ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌వ్వించాల‌ని చూశారు. కానీ వాళ్ల కామెడీ ఏమాత్రం పండ‌లేదు. షాయాజీకి అరుపులెక్కువ‌. సాంకేతిక విలువ‌ల గురించి చెప్పుకొనే సినిమా కాదిది. క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం ఇలా మూడు ప్ర‌ధాన బాధ్య‌త‌లు మోసిన కుమార్ నాగేంద్ర దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇంత‌కంటే గుండెల్లో గోదారి వంద రెట్లు న‌యం అనిపిస్తుంది.

మ‌నం ఏం తీసినా జ‌నం చూస్తారులే అనుకోవ‌డం భ్ర‌మ‌. ఏమాత్రం ప‌స‌లేని క‌థ‌తో, ప‌నిలేని కామెడీతో వ‌చ్చిన సినిమా ఇది. ఆడియ‌న్స్‌కి ఏమాత్రం మెప్పించ‌లేదు. జోరు పేరులో త‌ప్ప‌.. సినిమాలో లేనే లేదు.

రేటింగ్: ఆ ఒక్కటి ఆడక్కు బాబు దండం పెడ‌తా...