English | Telugu
'తమ్ముడు'ని మరింత ఇబ్బంది పెడుతున్న 'అన్నయ్య'!
Updated : Aug 8, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం 'బ్రో'. రూ.98 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో జూలై 28న బాక్సాఫీస్ బరిలోకి దిగిన బ్రో.. ఓపెనింగ్స్ అయితే బాగానే రాబట్టింది కానీ ఆ తర్వాత చతికిల పడింది. 11 రోజుల్లో ఈ చిత్రం రూ.67 కోట్ల దాకా షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 31 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యమే. ఫస్ట్ వీకెండ్ ముగిశాక, వీక్ డేస్ లో 'బ్రో' కలెక్షన్స్ బాగా పడిపోయినప్పటికీ.. రెండో వీకెండ్ లో కాస్త మెరుగ్గానే కలెక్షన్స్ వచ్చాయి. మూడో వీకెండ్ లో కూడా అదే కొనసాగితే.. నష్టాలు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ వారం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' థియేటర్లలోకి అడుగు పెడుతోంది.
'భోళా శంకర్' ఆగస్టు 11న విడుదలవుతోంది. స్టార్ హీరోల సినిమాలంటే భారీగా బిజినెస్ జరగడం, భారీ స్థాయిలో విడుదల కావడం సహజం. టాక్ తో సంబంధం లేకుండా.. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ తోనే ఎక్కువ శాతం రికవరీ సాధించాలన్న ఉద్దేశంతో అధిక సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తుంటారు. 'భోళా శంకర్' కూడా దానికి అతీతంకాదు. ఇది వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని అంచనా. అందుకు తగ్గట్లుగానే భారీ స్థాయిలో 'భోళా శంకర్' విడుదల కానుంది. అంటే 'భోళా శంకర్' కోసం ఇప్పటికే థియేటర్లలో ఉన్న 'బ్రో' తన థియేటర్లను త్యాగం చేయాల్సి ఉంది. దానివల్ల మూడో వారాంతంలో బ్రో కి రావాల్సిన అంతో ఇంతో కలెక్షన్స్ కూడా రావు. దీంతో ఓవరాల్ గా 30 కోట్ల నష్టాలను చూసే అవకాశముంది. పోనీ థియేటర్లను అలాగే అంటిపెట్టుకుందామంటే.. 'భోళా శంకర్' ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. ఒకవేళ థియేటర్లను అంటిపెట్టుకున్నా.. కొత్త సినిమా 'భోళా శంకర్'ని కాదని 'బ్రో'కి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇలా నిజానికి 'బ్రో' చిత్రానికి కాస్త నష్టాలను తగ్గించుకునే అవకాశమున్నా.. పరోక్షంగా 'భోళా శంకర్' కారణంగా ఆ ఛాన్స్ పోగొట్టుకుంటోంది.