English | Telugu

సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిన 'బేబీ' ట్రైలర్

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా సాయి రాజేశ్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా 'బేబీ'. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. జూలై 14న 'బేబీ' థియేటర్లలో విడుదలవుతోంది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పుడు సినిమా చూద్దామా అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జుట్టు, గడ్డాలు బాగా పెరిగిపోయి ఉన్న ఆనంద్ ఇంట్లోకి అడుగుపెట్టి తలుపులు మూస్తుండటంతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత అతని స్కూల్ డేస్‌లోకి స్టోరీ వెళ్లింది. "మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది" అనే లైన్లు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి. దాన్ని బట్టి స్కూలు రోజుల్లో వైష్ణవితో ఆనంద్ గాఢమైన ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. వాతలుపడిన ఆమె అరచేతిని పట్టుకొని "ఇక నుంచీ నన్ను కూడా ప్రేమించనిస్తావా?" అని అడిగాడు ఆనంద్. అంటే అప్పటికే వైష్ణవి కూడా అతడిని ప్రేమిస్తోందని అర్థమవుతోంది. ఆ తర్వాత పట్నంలో కాలేజీలో చేరిన వైష్ణవి జీవితంలోకి అక్కడే చదువుకుంటున్న విరాజ్ ప్రవేశించాడు. ఆనంద్ మాత్రం ఊళ్లోనే ఉండిపోయాడు. వైష్ణవిని ప్రేమిస్తున్నానని విరాజ్ చెప్పాడు. మరి వైష్ణవి నిజంగా ఎవరిని ప్రేమిస్తోంది? ఈ ముగ్గురి జీవితాలు ఏ తీరానికి చేరాయి? వైష్ణవిని గాఢంగా ప్రేమించిన ఆనంద్ ఆమె మరొకరి ప్రేమలో పడిందని తెలిసి పిచ్చివాడైపోయాడా? ఆమె కూడా అందరి ఆడపిల్లలు లాంటిదేనా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మనసుల్లో మెదులుతాయి. వీటికి జవాబులు కావాలంటే సినిమా చూడాల్సిందే.

మన్సుల్ని తడిచేసే ఒక ప్రేమకథగా బేబీ మన ముందుకు రానున్నదనే అభిప్రాయాన్ని బేబీ ట్రైలర్ కలిగిస్తోంది. ఇంతదాకా తన సినిమాలతో ఎక్కువగా నవ్వించడం ద్వారా వినోదాన్ని పంచిన దర్శకుడు సాయిరాజేశ్ ఈసారి ఒక భావోద్వేగపూరిత ప్రేమకథతో మన ముందుకు వస్తున్నాడనేది స్పష్టం. విజయ్ బల్గనిన్ మ్యూజిక్ సినిమాకు ఎస్సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.