English | Telugu

50 కోట్ల దిశగా 'బేబీ'.. 'అర్జున్ రెడ్డి'ని మించేలా ఉంది!

ఈమధ్య పెద్ద సినిమాలే వీక్ డేస్ లో చతికిలపడుతున్నాయి. అలాంటిది చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ' మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. అంచనాలకు మించిన ఓపెనింగ్స్ తో మొదటి వారాంతంలో సత్తా చూపించిన బేబీ.. వీక్ డేస్ లోనూ అదే జోరు చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

బేబీ సినిమా గత శుక్రవారం(జూలై 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులు రూ.2.60 కోట్ల షేర్, రూ.2.98 కోట్ల షేర్, రూ.3.77 కోట్ల షేర్ తో సత్తా చాటిన బేబీ.. సోమ, మంగళ, బుధ వారాల్లో కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ.3.72 కోట్ల షేర్, రూ.2.94 కోట్ల షేర్, రూ.2.45 కోట్ల షేర్ తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఆరు రోజుల్లో రూ.18.46 కోట్ల షేర్ సాధించింది. ఏరియాల వారీగా చూస్తే ఆరు రోజుల్లో నైజాంలో రూ.7.79 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.62 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.8.05 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.83 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.2.12 కోట్ల షేర్ వసూలు చేసిన బేబీ.. ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.21.41 కోట్ల షేర్(40.40 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఓవరాల్ గా రూ.7.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన బేబీ.. ఇప్పటికే బయ్యర్లకు రూ.13 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

విజయ్ దేవరకొండ కెరీర్ కి ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చిన సినిమా అంటే 'అర్జున్ రెడ్డి' అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ కి స్టార్డమ్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబీ' సినిమా, 'అర్జున్ రెడ్డి'ని మించిన కలెక్షన్స్ రాబట్టేలా ఉంది. వరల్డ్ వైడ్ గా రోజుకి రూ.5-6 కోట్ల స్థాయిలో గ్రాస్ రాబడుతున్న బేబీ, రెండో రోజుల్లో అర్జున్ రెడ్డిని బీట్ చేసే అవకాశముంది.