English | Telugu

మనం షూటింగ్‌ చేసేది హైదరాబాద్‌లోనా? పాకిస్థాన్‌ బోర్డర్‌లోనా?

మనం షూటింగ్‌ చేసేది హైదరాబాద్‌లోనా? పాకిస్థాన్‌ బోర్డర్‌లోనా?

ఈ డౌట్‌ హీరో, డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ వచ్చింది. అసలీ డౌట్‌ రావడానికి కారణం హీరోయిన్‌ కంగనా రనౌత్‌. లారెన్స్‌ తాజా చిత్రం ‘చంద్రముఖి2’లో కంగనా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో కంగనాను ఉద్దేశించి లారెన్స్‌ మాట్లాడుతూ ‘బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌ అయిన కంగనాతో చంద్రముఖి చేయించడంతోనే పి.వాసుగారు విజయం సాధించారు.

ఆమెతో కలిసి నటించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మొదట్లో ఆమెను చూస్తే చాలా భయమేసింది. దానికి కారణం ఆమె చుట్టూ వుండే సెక్యూరిటీ. ఆమె చుట్టూ ఎప్పుడూ ఐదుగురు గన్‌మెన్‌ ఉంటారు. వచ్చేటపుడు ఆమె నవ్వుతూనే వస్తారు. కానీ, పక్కన వున్న గన్‌మెన్‌ మాత్రం అస్సలు నవ్వరు. కాబట్టి ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌ మారిందంటే వాళ్లు గన్‌లు మనవైపు తిప్పేస్తారేమోనని భయం. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగేటప్పుడు ‘మేడమ్‌ నాకొక డౌటు.. నేను హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నానా? పాకిస్థాన్‌ బోర్డర్‌లో షూటింగ్‌ చేస్తున్నానా? ఎప్పుడు చూసినా గన్‌మెన్‌ మీ వెనకాలే నిలబడి ఉంటున్నారు. కొంచెం బయటికి పంపిస్తే ఫ్రీగా పనిచేయొచ్చు మేడమ్‌’ అని చెప్పాను. మేడమ్‌ హ్యాపీగా పంపించారు. అప్పటి నుంచి సరదాగా మాట్లాడడం, ఆమె కూడా బాగా రెస్పాండ్‌ అవ్వడంతో నా భయం పోయింది’ అంటూ కంగనాతో తన షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్‌ చేసుకున్నారు లారెన్స్‌.