English | Telugu

మరో అరుదైన ఘనత సాధించిన బాలయ్య.. సౌత్ ఇండియాలో ఒకే ఒక్కడు!

పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇలా ఘనతలు సాధిస్తూ దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరో అరుదైన ఘనత సాధించారు. ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశం ఆయనకు లభించింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారత నటుడు బాలకృష్ణ కావడం విశేషం. (Nandamuri Balakrishna)

ఈ అరుదైన అవకాశం లభించడంపై స్పందించిన బాలకృష్ణ, తన సంతోషాన్ని పంచుకున్నారు. "ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టం. ఈ రోజు నేను, మా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE India సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది. ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు… ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని.. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను." అంటూ బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకున్నారు.