English | Telugu

ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'!

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 18న థియేటర్లలో విడుదలైంది. 'ఓ బేబీ' లాంటి ఘన విజయం సాధించిన సినిమా తర్వాత నాలుగేళ్ల విరామంతో నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా, పైగా ఫీల్ గుడ్ ఫిలిమ్స్‌తో మంచి పేరు సంపాదించుకున్న స్వప్న సినిమా బ్యానర్‌ లో రూపొందిన సినిమా కావడంతో విడుదలకు ముందు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. కానీ విడుదలయ్యాక ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్లలో ఈ సినిమాకి అంతగా ఆదరణ లభించలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

'అన్నీ మంచి శకునములే' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలోనైనా ఆదరణ దక్కించుకుంటుందేమో చూడాలి.