English | Telugu
అక్కినేని ఆత్మబలం(ఈరోజు అక్కినేని జయంతి సందర్భంగా)
Updated : Sep 20, 2015
అక్కినేని ఆత్మబలం
ఇంద్రియాణి పరాణ్యహుః
ఇంద్రియేభ్యః పరం మనః
మానసస్థు పరాఃబుద్దిః
యే బుద్దే పరాతస్తు సహ
చలనం లేని ప్రకృతి కంటే, చలనం ఉన్న ఇంద్రియాలు గొప్పవి. చలనం ఉన్న ఇంద్రియాల కంటే ఆలోచన శక్తి గల మనసు గొప్పది. ఆలోచనా శక్తి గల మనసుకంటే.. విచక్షణా జ్ఞానం గొప్పది. విచక్షణా జ్ఞానం కంటే మంచి చెడులను బేరీజు వేసుకొనే ఆత్మ గొప్పది. అక్కినేని నాగేశ్వరరావు అక్షరాలా పాటించే మాటలివి. ఆయన నియమం ఇదే. ఆయన ప్రయాణం ఇదే. అందుకే ఓ సామాన్య వ్యక్తిగా, సాధారణ కుటుంబంలో మొదలైన ఆయన జీవితం శాశ్వత ఖ్యాతి గడించింది. అసమాన్యమైన అద్భుతాలు సాధించింది. భావి తరాలకు స్ఫూర్తి నిచ్చింది.
అక్కినేనికి ఓ విజయం గాలివాటంగా రాలేదు. ఆయన సాధించుకొన్న కీర్తి ప్రతిష్టలు - రాత్రికి రాత్రే వరంగా లభించలేదు. ఆయన ఆలోచనలు, పాటించిన నియమాలు, తనని తాను తీర్చిదిద్దుకొన్న విధానం.. అక్కినేని ఆకాశమంత ఎత్తులో కూర్చోబెట్టాయి. ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న రోజుల్లో... సినిమా ప్రపంచం అంతా ఎన్టీఆర్ వైపే చూస్తున్న కాలంలో... ఏఎన్నార్ తనకంటూ ఓ స్థాయినీ, స్థానాన్నీ దక్కించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. మహా వృక్షాల నీడలో మరో వృక్షం ఎదగదంటారు. కానీ ఆ వృక్షం పక్కనే... శాఖోపశాఖలుగా విస్తరించిన మరో మహా వృక్షం.. ఏఎన్నార్!!
ఎన్టీఆర్ ఆజానుభావుడు.. అందగాడు. కళ్లలో ఏదో తేజస్సు, చూపులో దైవత్వం, మాటలో గాంభీర్యం అన్నీ ఉన్నాయి. మరి ఏఎన్నార్‌లో ఏముంది??
- ఆత్మబలం. అవును... ఆత్మ సంకల్పం, ఆత్మబలం, మొండినమ్మకం... ఇవన్నీ మెండిగా ఉన్న నటుడు ఏఎన్నార్. ఏ పాత్ర తనకు నప్పుతుందో, ఏ పాత్ర నప్పదో... ఎక్కడ తాను విజృంభించగలడో, ఎక్కడ తాను నిలబడలేడో ఆ బేరీజులు బాగా వేసుకొన్న వ్యక్తి.
ఫలానా పాత్ర ఏఎన్నార్ చేయలేడు అనే మాట వినిపించిందంటే.. రెచ్చిపోయి నటించడం ఆయన రివాజు.
దేవదాసు అక్కినేని జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా
దేవదాసుగా అక్కినేని పనికిరాడంటే... దేవదాసుగా అక్కినేనిని తప్ప ఇంకెవర్నీ ఉహించనంత గొప్ప నటన కనబరిచి... తనేంటో నిరూపించుకొన్నారు.
విప్రనారాయణకీ అదే తీరు. పరమనాస్తికుడు అక్కినేని భక్తుడి పాత్రలో ఎలా రాణిస్తాడు? అంటూ ఎద్దేవా చేసినవాళ్లెంతోమంది. దానికి అక్కినేని సమాధానం ఏమిటో తెలుసా?? తాగుబోతు పాత్ర చేయాలంటే.. వాడు నిజంగానే తప్పతాగి పడిపోవాలా? నటుడన్నక ఏ పాత్రలో అయినా ఇమిడిపోవాలి.. తనది కాని ప్రపంచంలోకి వెళ్లిపోవాలి... లేదంటే నటుడే కాదన్నారు. విప్రనారాయణగా జీవించారు. ఏఎన్నార్ స్టామినాకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది?
అ అంటే.. అక్కినేని... అ అంటే.. అద్భుతం
ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న రోజుల్లో... సినిమా ప్రపంచం అంతా ఎన్టీఆర్ వైపే చూస్తున్న కాలంలో... ఏఎన్నార్ తనకంటూ ఓ స్థాయినీ, స్థానాన్నీ దక్కించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. మహా వృక్షాల నీడలో మరో వృక్షం ఎదగదంటారు. కానీ ఆ వృక్షం పక్కనే... శాఖోపశాఖలుగా విస్తరించిన మరో మహా వృక్షం.. ఏఎన్నార్!!
తనకు ఏ పాత్రలు నప్పవో కూడా అక్కినేనికి బాగా తెలుసు
కన్యాశుల్కంలో గిరీశం పాత్ర పోషించే అవకాశం అక్కినేనికే వచ్చింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. దేవదాసు లాంటి ఉదాత్తమైన పాత్ర చేశాక, మాయ మాటలు చెప్పి మోసం చేసే గిరీశం పాత్రలు వేయడం బాగోదు. అలాంటి నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు నాకు నప్పవు అంటూ ఆ సినిమాని తిరస్కరించారు, సదారమ అనే మరో సినిమాని నాగేశ్వరరావు మధ్యలోనే ఆపేశారు. అలా ఏఎన్నార్ సినిమా ఒకటి షూటింగ్ దశలో ఆగిపోవడం అదే మొదటిసారి.. అదే చివరి సారి. ఈ సినిమా ఆపేయడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇందులో అక్కినేనిది దొంగ పాత్ర. అలాగని మంచి దొంగ కాదు. చివరి వరకూ హీరో దొంగలానే ఉంటాడు. ఇలాంటి పాత్రలు చేయడం వల్ల నాకే కాదు, ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. నా పాత్రని జనం జీర్ణం చేసుకోలేరు.. ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది.కాబట్టి ఈ సినిమాని ఇక్కడితో ఆపేయండి. కావాలంటే ఆ నష్టం నేను భరిస్తా... అంటూ ఏఎన్నార్ అనేసరికి దర్శక నిర్మాతలు ఈ సినిమాని మధ్యలోనే వదిలేశారు.
కృష్ణార్జున యుద్దం తరవాత ఎన్టీఆర్ పక్కన పౌరాణిక వేషాలొస్తే చేయకూడదు అని నిర్ణయించుకొన్నారు ఏఎన్నార్. కారణం ఎన్టీఆర్ పక్కన తాను పొట్టిగా కనిపిస్తారు. పైగా.. తన పాత్ర ఎలివేట్ అవ్వదు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్ర ధరిస్తే.. పక్కనున్న పాత్రలపై జనం దృష్టి పెట్టరని. ఈ విషయాన్ని అక్కినేని చాలా సందర్భాల్లో మీడియాతో చెప్పుకొచ్చారు. తన ఆత్మకథలోనూ రాసుకొన్నారు. తన పోటీ దారుడ్ని మెచ్చుకోవడం... గొప్పదనాన్ని కీర్తించడం, తన ప్లస్సుల్నీ, మైనస్సుల్నీ బేరీజు వేసుకోవడం... ఏఎన్నార్‌కే చెల్లింది.
తనకు నప్పని పాత్రల్లో ఏఎన్నార్ వేలుపెట్టలేదు.
తాను చేసిన పాత్రల్ని ఇంకొకరు వేలు పెట్టి చూపించేలా నటించలేదు,
అదీ.. అక్కినేని గొప్పదనం. అది అచ్చంగా ఆయన ఆత్మబలం!!
(ఈరోజు అక్కినేని జయంతి సందర్భంగా)