English | Telugu
'ఏజెంట్'కి ఎంత కష్టమొచ్చింది!
Updated : Apr 13, 2023
ఆలస్యం అమృతం విషం అనే మాట అక్కినేని అఖిల్ తాజా చిత్రం 'ఏజెంట్'కి సరిగ్గా సరిపోతుంది. మామూలుగా పాన్ ఇండియా సినిమా అంటే.. ఎంతో కొంత హైప్ క్రియేట్ అవుతుంది. మొదట్లో ఏజెంట్ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఆలస్యం కారణంగా ఈ సినిమాకి వచ్చిన హైప్ కూడా పోయింది. దీంతో అప్పట్లో భారీ ధరలకు రైట్స్ దక్కించుకోవడానికి ముందుకొచ్చిన బయ్యర్లు.. ఇప్పుడు భారీగా కోత పెడుతున్నారట.
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఎప్పుడో ప్రారంభమైన ఈ మూవీ గతేడాదే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వచ్చింది. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ తో పాటు.. పాన్ ఇండియా మూవీ కావడంతో మొదట్లో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అఖిల్ మేకోవర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. బయ్యర్లు కూడా థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి ఆసక్తి చూపించారు. ఒకానొక సమయంలో 60-70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ నమ్మకంతోనే మేకర్స్ వెయిట్ చేసినట్టున్నారు. అయితే పదే పదే వాయిదా పడుతూ సినిమా ఆలస్యమవ్వడంతో.. ప్రేక్షకులతో పాటు బయ్యర్లలోనూ ఆసక్తి తగ్గిపోయింది. అప్పట్లో భారీ ధరకు రైట్స్ అడిగిన వారే, ఇప్పుడు అందులో సగానికి తీసుకుంటాం అంటున్నారట. దీంతో సొంతంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది.