English | Telugu
‘అబ్బాయితో అమ్మాయి’ అలరిస్తారట...
Updated : Dec 18, 2015
నాగశౌర్య, పలక్ లల్వాని జంటగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా సెన్సార్ పూర్తయింది. యు.ఎ. సర్టిఫికెట్ వచ్చింది. ఇంత చక్కటి ఫీల్ వున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని ఈమధ్యకాలంలో తాము చూడలేదని సెన్సార్ సభ్యులు అభినందించారని సమాచారం. కథ కొత్త తరహాలో వుందని, ఇళయరాజా సంగీతం, చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలాంటి చిత్రీకరణ తమకు కొత్త అనుభూతిని కలిగించాయని ప్రశంసించారని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 1న విడుదల అవుతోందట. మొత్తమ్మీద ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు యూనిట్ సభ్యులు ఎక్కడో నక్కతోకని తొక్కినట్టున్నారు. ఎందుకంటే, ఈ సినిమాకి మొదట్నుంచీ కాస్టింగ్, టెక్నీషియన్స్ రూపంలో ఎన్నో ప్లస్సులు యాడ్ అవుతూ వస్తున్నాయి. అన్నిటికంటే పెద్ద ప్లస్ ఇళయరాజా సంగీతం అని యూనిట్ అంటోంది. చెవుల తుప్పు వదలించే సంగీత సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో ‘అబ్బాయితో అమ్మాయి’కి ఇళయరాజా ప్రవహించే సెలయేరు ధ్వనిలాంటి మృదుమధురమైన సంగీతాన్ని అందించారని, తమ సినిమా సాధించబోయే అద్భుత విజయానికి ప్రధానకారణంగా సంగీతం నిలుస్తుందని దర్శకుడు రమేష్ వర్మ చెబుతున్నారు. తాను ‘రైడ్’ సినిమాని రూపొందించినప్పుడు విజయం మీద ఎంత కాన్ఫిడెన్స్ కలిగిందో, ఇప్పుడు ‘అబ్బాయితో అమ్మాయి’ విషయంలో అంతే కాన్ఫిడెన్స్ ఏర్పడిందని ఆయన చెప్పారు. ప్రేక్షకులలో, సినిమా రంగంలో ఎన్నో అంచనాలను పెంచుకున్న తమ సినిమా అన్ని అంచనాలనూ అధిగమిస్తుందని ఆయన అంటున్నారు.