English | Telugu
ఒక హృదయము పలికిన సరిగమ స్వరము అది....
Updated : Jan 9, 2015
ఏసుదాస్ పాటంటే..
రెండు మనసులు మనసువిప్పి మాట్లాడుకొంటున్నట్టుంటుంది.
వెన్నెల వాకిట్లో ముత్యాల ముగ్గు వేసినట్టు ఉంటుంది.
గుమ్మానికి పసుపు పూసినట్టుంటుంది.
పరగడుపున అమృతం తాగినట్టుంటుంది.
ఏసుదాస్ పాట వింటే..
మగ కోకిలలన్నీ కచ్చేరి చేసినట్టుంటుంది.
రాగాల వాగు పొంగినట్టుంటుంది.
పండక్కి పరమాన్నం వండుకొన్నట్టుంటుంది.
పసివాడు నవ్వినట్టుంటుంది!
ఇంకేం చెప్పగలం ఆయన గొంతు గురించి, ఇంకెలా వర్ణించగలం ఆయన గాన మాధుర్యం గురించి!
పాటని బెల్లం ఊటలా మార్చేసే శక్తి ఉందాయనకు!
మన కనుల్ని, కలల్ని... ఆ మాటకొస్తే ఈ సృష్టినే జోకొట్టగల విద్య తెలుసు ఆయనకు!
ఏసుదాసు నిట్టూర్పులూ రాగాలైపోతుంటాయి..
ఏసుదాసు ఉచ్ఛాశ్వనిశ్వాసలూ పాటలుగా మారిపోతుంటాయి..
ఆయన ఊ అంటే పాట.. ఊహూ అన్నా పాటే! పెదాలు కదిపితే చాలు.. పరవశించిపోతాయి ప్రాణాలు.... అదీ ఏసుదాస్ పాటంంటే...
సృష్టికర్త ఒక బ్రహ్మ... అతడిని సృష్టించినదొక అమ్మ...
- ఈ పాట వినండి. అమ్మ ఎక్కడుందో వెతుక్కొంటూ వెళ్లాలని పిస్తుంది. ఆమె ఒళ్లో సేదతీరాలనిపిస్తుంది. `అమ్మ` గొప్పదనాన్ని అక్షరాల్లో కాదు, ఆక్రందనలోనూ ఆవిష్కరించిన గాన బ్రహ్మ... ఏసుదాస్.
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా... అంటూ ఏసుదాస్ పాడుకొంటూ వెళ్లిపోయారు.. నిజంగానే ఆ కాలం కాసేపు ఆగి.. ఏసుదాస్ పాట విని, ఆ మాధుర్యాన్ని మోసుకొంటూ వెళ్లుంటుంది..!
ఏనావదేతీరమో, ఏ నేస్తమేజన్మ వరమో..
ఇదేలే తరతరాల చరితం.. జ్వలించే జీవితాల కథనం
తెలవారదేమో స్వామి..
లేలే బాబా నిదుర లేవయ్యా...
ఇలా ఎన్ని పాటలని..?? వీటిలో ఏ పాట గురించి మనం ముందు ప్రస్తావించుకోవాలి..? ప‌్రతిదీ మన మనసుని పునీతం చేసినదే. ఏసుదాస్ గానామృతధారలో తడిసి ముద్దయిపోయినవాళ్లమే. ప్రతి పాట మనసుల్ని తాకి, అటూ ఇటూ కదలక అక్కడే తిష్టవేసుకొని కూర్చుండిపోతే.. ఎన్ని పాటలని గుర్తు పెట్టుకొంటాం..?
ప్రేమ గీతాలు, విరహగీతికలు, విషాద రాగాలు, భక్తి భావాలు.. అన్నింటినీ రంగరించి, తన గొంతుతో పలికించగల శక్తి ఆయనకే ఉంది. ఏసుదాస్ గాయకుడే కాదు, జాతీయ సమైక్యతకు, సమగ్రతకు నిదర్శనం. ఎందుకంటే ఆయనో క్రైస్తవుడు. కానీ రాముడు, సాయిబాబు, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వరస్వామి.. ఇలా హిందూ దేవుళ్ళ పాటలన్నీ ఆయన పాడినవే. మరీ ముఖ్యంగా ఆ శబరిమలేశుడి కోసం ఏసుదాస్ పాడినన్ని పాటలు మరో గాయకుడు పాడలేదు. సాయిబాబా గీతాలకు ఏసుదాస్ గొంతే ఆల్ టైమ్ ఫేవరెట్. ఒకట్రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ ఆయన గీతాలు ఆలపించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబ్బిక్ ఇలా ప్రతి పాటా ఆయన గొంతులో పరవళ్లు తొక్కింది.
1961 నుంచి 2015.. దాదాపు అర్థ శతాబ్దం! అందులో యాభై వేల గీతాలు, 7 జాతీయ పురస్కారాలు. 40 రాష్ట్రస్థాయి అవార్డులు, మరెన్నో సత్కారాలు. ఇదీ ఏసుదాస్ చరిత్ర! సినీ గీతాలు పక్కన పెడితే.. కచ్చేరీలు, ప్రయివేటు ఆల్బమ్స్‌కి లెక్కేలేదు. పాట ఆయన జీవితం.. పాటే ఆయనకు ప్రాణం! ఇప్పటికీ పాటతో ఆయన మమేకం అవుతూనే ఉన్నారు. సినిమా పాటల్ని బాగా తగ్గించుకొని.. ఆధ్యాత్మిక గీతాలకు, కచ్చేరిలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆయన కేరళలో పుట్టినా యావత్ భారత దేశం.. `మనవాడే` అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ఎదిగారు ఏసుదాస్. ఆయన జన్మ పాటకు అంకితం!! ఏసుదాస్ ఇలానే మరెన్నో గీతాలకు ప్రాణంపోయాలని, ఆ పాటలు వింటూ... మన ప్రాణాలు పరవశించిపోవాలని కోరుకొందాం..!
(ఈరోజు ఏసుదాస్ పుట్టిన రోజు సందర్భంగా)