English | Telugu
ఆశల పల్లకిలో 2016
Updated : Dec 31, 2015
2015కి గుడ్ బై చెప్పేసే సమయమిది. సరికొత్త ఆశలతో కొత్తయేడాదికి స్వాగత సత్కారాలు పంపుతున్న వేళ ఇది. 2015 తెలుగు సినిమా పరిశ్రమకు మిశ్రమ ఫలితాల్ని అందించింది. బాహుబలి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తో పాటు బ్రూస్లీ, అఖిల్, కికి 2 లాంటి డిజాస్టర్లనూ రుచి చూపించింది. బాలీవుడ్ ప్రముఖుల ఆకస్మిక మరణాలు... చిత్రసీమను కదిలించాయి. ఇలా ఎన్నో జ్ఞాపకాలు.. 2015 ఇప్పుడు కాలగర్భంలో కలసిపోతున్న.. ఆ స్మృతులు మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.
ఇప్పుడు 2016కి కోటి ఆశలతో క్లాప్ కొట్టేయబోతున్నాం. 2016లోనూ స్టార్ హీరోల హంగామా కనిపించబోతోంది. కొత్త రికార్డులకు, బ్లాక్ బ్లస్టర్ విజయాలకూ.. ఈ యేడాదీ సూపర్ ఛాన్స్ ఉంది. సంక్రాంతికి రాబోతున్న డిక్టేటర్, నాన్నకు ప్రేమతో చిత్రాలకు రికార్డులు బద్దలు కొట్టే శక్తి సామర్థ్యాలున్నాయి. వేసవికి వస్తున్న సర్దార్, బ్రహ్మోత్సవం వంద కోట్ల వైపు కన్నేశాయి.
బాహుబలి 2 ఈ యేడాది వచ్చేస్తే.. ఇక ఆ సంబరం రెట్టింపు అవుతుంది. ఈ యేడూ... తెలుగు చిత్రసీమ వందల కోట్లు తన బ్యాగులో వేసుకొనే ఛాన్స్ దక్కుతుంది. రామ్‌చరణ్ తనిఒరువన్.. కూడా 2016లోనే వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా చిరంజీవి 150వ సినిమా కత్తి రీమేక్ కొత్త యేడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. దసరాకి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
బన్నీ సరైనోడుతో మరో రూ.50 కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. రవితేజ, నాగార్జున, గోపీచంద్... వీళ్లంతా ఘన విజయాల్ని సాధించే సత్తా ఉన్నవాళ్లే, చిన్న సినిమాలు ఎప్పుడు ఏ అద్భుతాన్ని సృష్టిస్తాయో చెప్పలేం. సో.. 2016లోనూ భారీ విజయాల్ని చూడొచ్చన్నమాట.