English | Telugu
సినీ కార్మికుల సమ్మె.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తెలంగాణ ఫెడరేషన్!
Updated : Aug 6, 2025
తెలుగు సినీ కార్మికులు సమ్మె సైరన్ మోగించిన సంగతి తెలిసిందే. సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగుల్లో పాల్గొనేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే ఒకేసారి అంత శాతం పెంచడానికి నిర్మాతలు సుముఖంగా లేరు. 10-15 శాతం వరకు పెంచడానికి కొందరు నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం 30 శాతం పెంపు కోసం పట్టు పడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మెకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కొందరు నిర్మాతలు చిరంజీవిని కలిశారు. మరోవైపు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది.
"చిత్ర పరిశ్రమలో జరుగుతున్న స్ట్రైక్ తో మా కార్మిక ఫెడరేషన్ కి సంబంధం లేదు. మా దృష్టికి రాలేదు. మేము తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారితో అనుసంధానమై ఉన్నాము. చలనచిత్ర నిర్మాత మండలి వారితోనే మేము కలిసి పని చేస్తాం. తెలంగాణ ఫెడరేషన్ అన్ని క్రాఫ్ట్ వాళ్ళు వర్క్ చేయుటకు సిద్ధంగా ఉన్నారు. వివాదాన్ని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ వారికి, తెలంగాణ ఎఫ్.డి.సి వారికి తెలియజేయడం జరిగింది." అంటూ తెలంగాణ ఫెడరేషన్ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
తెలంగాణ ఫెడరేషన్ తాజా ప్రకటనతో.. కార్మికుల సమ్మె ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.