English | Telugu

బరిలో ప్రభాస్ ఉన్నా తగ్గేదేలే.. అసలు వీళ్ళ ధైర్యమేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని 2025, ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే పీపుల్ మీడియా బ్యానర్ లో తెరకెక్కుతోన్న మరో చిత్రం 'మిరాయ్'ని సైతం అదే సమయంలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసి ఉన్నారు. దీంతో 'రాజా సాబ్' ఎంట్రీతో 'మిరాయ్' విడుదల తేదీ మారడం ఖాయమని భావించారంతా. కానీ పీపుల్ మీడియా మాత్రం తగ్గేదేలే అంటోంది.

'హనుమాన్'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటిస్తున్న సినిమా 'మిరాయ్' (Mirai). కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ కీ రోల్ చేస్తున్నాడు. అనౌన్స్ మెంట్ సమయంలోనే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఇటీవల 'రాజా సాబ్'ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో.. 'మిరాయ్' విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రభాస్ సినిమా థియేటర్లలో ఉంటే.. కనీసం రెండు మూడు వారాల పాటు ఇతర సినిమాల వైపు ప్రేక్షకుల దృష్టి మళ్ళదు. దానికి తోడు 'రాజా సాబ్', 'మిరాయ్' రెండు సినిమాలనూ పీపుల్ మీడియానే నిర్మిస్తోంది. దీంతో 'మిరాయ్' రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని అనుకున్నారంతా. కానీ అలాంటిదేమీ లేదని తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

తేజ సజ్జ పుట్టినరోజు(ఆగష్టు 23) సందర్భంగా తాజాగా మేకర్స్ పోస్టర్ ను వదిలారు. మండుతున్న కర్రను పట్టుకొని, తేజ గాల్లో వేలాడుతున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సినిమాని 2025, ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో 'రాజా సాబ్', 'మిరాయ్' మధ్య బాక్సాఫీస్ వార్ ఖాయమైంది. అసలే ఒకే బ్యానర్ లో రూపొందుతోన్న రెండు పాన్ ఇండియా సినిమాలు. దానికి తోడు అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా. మరి వారం వ్యవధిలోనే 'రాజా సాబ్'కి పోటీగా వస్తున్న 'మిరాయ్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.