English | Telugu
మరణం లేని మహా మనిషి ఎన్టీఆర్
Updated : Jan 18, 2016
సృష్టినే శాశించిన మనిషి.. అంతరిక్షాన్ని సైతం అదుపులో పెట్టుకొన్న అతని మేధస్సు... మరణాన్ని మాత్రం జయించలేకపోయింది..!
అలాంటి మరణం కూడా కొంతమంది ముందు తలవొంచుతుంది.. ఆ మహా మనిషి కి సలాం కొడుతుంది. ఎన్టీఆర్ కూడా.. అలాంటి మహనీయుడే!
విశ్వ విఖ్యాత.. నట విరాఠ్.. నవ రసనటనా సారభౌమ.. ఎన్టీఆర్ గుర్తొచ్చినప్పుడల్లా.. తెలుగువారి హృదయాలు ఉప్పొంగుతాయి. తెలుగుజాతి సగర్వంగా ఛాతీ ఎత్తుకొని నిలబడుతుంది. తెలుగుదనం తొడకొట్టి సవాల్ చేస్తుంది.. అదంతా ఎన్టీఆర్ ఘనతే! ఆయన తెలుగువారినీ, ఈలోకాన్ని విడచి 20 యేళ్లు గడిచిపోయాయి. అయినా ప్రతీ రోజూ.. ఏదో ఓ సందర్భంలో ఎన్టీఆర్‌ని తలచుకొంటూనే ఉన్నాం. మన ` అన్న`ని స్మరిస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ ముద్ర అలాంటిది.. ఆయన ఘనత అంతటిది.
టీవీ చూస్తుంటాం.. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మన మనసుని, జ్ఞాపకాల్ని ఆకాలంలోకి తీసుకెళ్లిపోతుంటాయి. ఆ స్మృతుల్లో ఎన్టీఆర్ పేరు తప్పకుండా మెదులుతుంది. ఎఫ్.ఎమ్‌లో పాటలేవో వింటుంటాం.. వాటిలో కొన్నయినా ఎన్టీఆర్ స్టెప్పులనో, గొంతునో, ఆహార్యాన్నో గుర్తు చేస్తుంటాయి.. మళ్లీ మన మనసు పరిమళిస్తుంటుంది. రాజకీయాల గురించి మాట్లాడుకొంటుంటాం.. శ్రీరామరాజ్యం లాంటి పాలన కావాలని కోరుకొంటుంటాం.. అప్పుడు కూడా ఆయనే మనసు తలుపు తడుతుంటారు. తెలుగువాళ్లంతా ఎన్టీఆర్ ని స్మరించుకోవడం ఓ దినచర్యగా మార్చేసుకొంటే... ఇక ఆ మహనీయునికి మరణం ఎక్కడిది??
అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఓ నూతన ఒరవడి సృష్టించి.. రెండు రంగాల్నీ శాశించిన అతి కొద్దిమంది జాబితాలో ఎన్టీఆర్ పేరు ప్రధమ స్థానంలో ఉంటుంది. దర్శకుడిగా ఆయన ప్రతిభ తక్కువదా? దానవీర శూర కర్ణ.. ఒక్కటి చాలు. దర్శకుడిగా ఎన్టీఆర్ ఏమిటో చెప్పడానికి. మూడు పాత్రలు పోషిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు చూసుకొంటూ ఆ సినిమాని ఆల్ టైమ్ క్లాసిక్‌గా తీర్చిదిద్దిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుంది. యాభై పైబడినా.. డ్యూయెట్లు పాడి మెప్పించడం ఆయనకే సాధ్యమైంది. హీరోగా తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకొని.. విలన్ పాత్రల్లోనూ శభభాష్ అనిపించుకోవడం నందమూరి నట మహా వృక్షానికే సాధ్యమైంది.
సినిమాని తెలుగువారి దైనందిన వ్యవహారంగా మార్చింది... రాజకీయాలను సామాన్యుడి ఇంటి ముందు తీసుకెళ్లిందీ.. అచ్చంగా ఆయనే. తెలుగు వారికంటూ ఓ ఆత్మగౌరవం ఉందని చెప్పి.. దాన్ని కాపాడుకొనేలా తెలుగుజాతిని తీర్చిదిద్దింది ఆయన. తెలుగు సినిమా.. తెలుగు భాష.. తెలుగు రాజకీయం... వీటికి మరణం ఉండదు.. వీటిని నిలబెట్టిన ఎన్టీఆర్‌కీ లేదు.. అందుకే మరణాన్ని జయించిన మహా వీరుడయ్యారు ఎన్టీఆర్...!!