English | Telugu
చిరంజీవిని ఎందుకు పిలిచారో మాకు తెలీదు!
Updated : Feb 9, 2022
టికెట్ ధరలతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చిన సంగతి తెలిసందే. గురువారం నాడు సీఎం వైఎస్ జగన్ ని చిరంజీవిని కలవనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. టికెట్ ధరలతో పాటు, చిరంజీవి-జగన్ భేటీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ మంచిదే కానీ అది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండటం కరెక్ట్ కాదని, ఆ సిస్టమ్ ఫిల్మ్ ఛాంబర్ తో కలిసి ఉండాలని భరద్వాజ్ అన్నారు. టికెట్ రేట్స్ అనేది మేజర్ ఇష్యూ అనుకుంటున్నాం కానీ మా దృష్టిలో అది చాలా చిన్న ఇష్యూ అని చెప్పారు. సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవడంలో తప్పులేదు కానీ తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచడం వల్ల చిన్న సినిమాలు కూడా టికెట్ రేట్స్ తగ్గించట్లేదు. దానివల్ల ఆడియెన్స్ రాక సినిమాలకు ఎక్కువ నష్టాలు వస్తున్నాయి అన్నారు. చిన్న సినిమాలు తక్కువ స్క్రీన్స్ లో, పెద్ద సినిమాలు భారీ ఎత్తున చాలా ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల అవుతాయి కాబట్టి టికెట్ ధరల తగ్గింపు అనేది పెద్ద సమస్య కాదని అన్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుకుంటే, టాక్స్ కూడా ఎక్కువ కట్టాలని అన్నారు.
ఇండస్ట్రీ కూడా భారీగా బడ్జెట్ పెంచి, ప్రేక్షకుల మీద భారం మోపాలనుకోవడం కరెక్ట్ కాదని భరద్వాజ్ చెప్పారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, రెమ్యునరేషన్స్ తగ్గించుకోకుండా.. వర్కింగ్ హౌర్స్ పెంచుకొని, లగ్జరీలు తగ్గించుకుంటే బడ్జెట్ తగ్గుతుందని అన్నారు. పుష్ప సినిమా హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందని, కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించాలని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
సినీ పరిశ్రమకు కావాల్సినని వివరిస్తూ ఛాంబర్ తరఫున ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెప్పారు. చిరంజీవి గారినే ఎందుకు పిలిచారో మాకు తెలియదని, ఆయన్ని మాత్రమే పిలిస్తే ఆయన వెంట మేమొస్తామంటూ పరుగెత్తలేం కదా అని అన్నారు. చిరంజీవి లాంటి సినీ పెద్దని పిలవడంలో తప్పులేదని, అయితే ఏ ప్రభుత్వమైనా ముందుగా ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని పిలిచి చర్చించాల్సిన అవసరముందని అన్నారు. దాసరి నారాయణరావు సమయంలో కూడా ఆయనతో పాటు బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రభుత్వాలు పిలిచేవని గుర్తుచేశారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళని పిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం పిలవకపోవడం వల్ల కొందరు చిరంజీవిపై బురదచల్లుతున్నారని అన్నారు. కాబట్టి మా నాయకుడిగా భావించే చిరంజీవితో పాటు ఛాంబర్, కౌన్సిల్ సభ్యులని కూడా పిలిస్తే బాగుందని భరద్వాజ్ అన్నారు.