English | Telugu
కండలు కాదు బాబూ.. కామెడీ కావాలి!
Updated : Sep 9, 2015
అచ్చమైన భీమవరం యాస, అదిరిపోయే టైమింగ్, పంచ్‌ల మీద పంచులు... ఇదీ సునీల్ అంటే. విజయభాస్కర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కమెడియన్‌గా తిరుగులేని పాత్రలు చేసి.. ఒక్కసారిగా `స్టార్` అయిపోయాడు. బ్రహ్మానందం తరవాత.. ఆ స్థాయిలో బిజీగా ఉంటూ, పారితోషికం తీసుకొనే కమెడియన్‌గా ఒక దశలో సునీల్ పేరు చెప్పుకొనేవారు. కమెడియన్‌గా బండి మాంఛి స్పీడుమీదున్నప్పుడు హీరోగా ట్రాక్ మార్చాడు సునీల్. తొలుత ఆ బండీ సాఫీగానే సాగింది. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు లాంటి సినిమాలతో హిట్స్ కొట్టాడు. రూ.3 కోట్ల హీరోగా మారాడు. కమెడియన్‌గా పది సినిమాలకు పంపాదించేది.. హీరోగా ఒక్కసారి అందుకొన్నాడు. దానికి తోడు క్రేజూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ లెక్కలేసుకొన్నాడు.
అంతా బాగానే ఉంది. అయితే సునీల్ కమెడియన్ నుంచి హీరోగా మారి పెద్ద తప్పు చేశాడని అతని సన్నిహితులు, శ్రేయోభిలాషులూ వాపోతుంటారు. సునీల్ ట్రాక్ రికార్డు చూస్తే ఆమాటా నిజమే అనిపిస్తుంటుంది. పూలరంగడు తరవాత సునీల్ హీరోగా విజయాలు అందుకోలేదు. తడాఖా హిట్టయినా అది నాగచైతన్య ఖాతాలోకి వెళ్లిపోయింది. సునీల్‌ని హీరోగా `భరిస్తూ` సినిమాలు తీయడం కష్టమనే స్థాయికి వచ్చేశాడు. దానికి కారణం.. అన్నం పెట్టిన కామెడీని వదిలేయడమే. సునీల్ కండలు పెంచి, సిక్స్ ప్యాక్ తెచ్చుకొని, మాస్ ఇమేజీ కోసం తాపత్రయపడడం సునీల్ కెరీర్‌కి ఇబ్బందికరంగా మారింది. ఎంత హీరోగా మారినా, సునీల్ నుంచి ఆశిస్తోంది కామెడీనే. ఆ సంగతి తనకీ తెలుసు. కామెడీ అందివ్వగలుగుతున్నాడు గానీ, అది కొంచెమే అవుతోంది.
హీరోయిజం, హీరోయిన్‌తో రొమాన్స్, యాక్షన్ పార్ట్ అంటూ కామెడీని పక్కన పెట్టేస్తున్నాడు సునీల్. దాంతో ప్రేక్షకులూ నిరుత్సాహానికి గురవుతున్నారు. సునీల్ ట్రేడ్ మార్క్ వినోదాన్ని తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. దానికి తోడు బంతిలా గుండ్రంగా ఉండే సునీల్ కాస్త సన్నగా రివటలా మారాడు. ఈ ఆకారమూ ఇబ్బందిగానే అనిపిస్తోంది. సునీల్ ఇది వరకే బాగున్నాడు అన్నవాళ్లూ లేకపోలేదు. యాక్షన్ మోజులోంచి సునీల్ బయటకు వచ్చి కామెడీ చేస్తేనే తప్ప.. మెప్పించడం కష్టమనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తం అవుతోంది. తాజాగా సునీల్ నటించిన కృష్ణాష్టమి టీజర్ విడుదలైంది. అందులోనూ సునీల్ యాక్షన్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నట్టే కనిపిస్తోంది. మరి ఈ యాక్షన్ మోజులోంచి సునీల్ ఎప్పుడు బయటకు వస్తాడో... ఎప్పుడు కామెడీ పండిస్తాడో. ఈ దశలో సునీల్‌ని రక్షించేది నవ్వులే.