English | Telugu
డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్.. పరారీలో రకుల్ ప్రీత్ సింగ్!
Updated : Jul 15, 2024
మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అతనితోపాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఆరుగురిని,ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన ఆపరేషన్‌లో వీరంతా పట్టుపడ్డారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ వారిలో నలుగురు వ్యాపార రంగానికి చెందినవారు కాగా, ఇద్దరు సినీ రంగానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో 200 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా. గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్ తరలించి ఇక్కడ కొందరు ప్రముఖులకు సరఫరా చేస్తున్నారని తెలిసింది.
హైదరాబాద్‌లో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారాన్ని పట్టుబడ్డ నైజీరియన్ల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే దానికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని పోలీసులు ప్రకటించడం లేదు. ఎందుకంటే దాని వల్ల మరికొందరు నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం విచారిస్తున్నామని మాత్రమే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అమన్ ప్రీత్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ రకుల్‌ప్రీత్‌పై పడిరది. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న రకుల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రకుల్ కోసం మీడియా ప్రయత్నిస్తోంది. కానీ, ఆమె అందుబాటులోకి రావడం లేదని, ప్రస్తుతం ఆమె ఎక్కడ వుంది అనే సమాచారం కూడా తెలియడం లేదు అంటున్నారు.
ఇటీవల డ్రగ్స్ వాడకం విషయంలో టాలీవుడ్ నటి హేమపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ట్విస్టుల తర్వాత హేమ అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అవ్వడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో, చివరికి ఏమవుతుందో చూడాలి.