English | Telugu
ఎంతైనా రజనీ గొప్పోడే!
Updated : Dec 9, 2014
సినిమా వాళ్లంపై పైపై మెరుగులు, ప్లాస్టిక్ నవ్వులు! తమ లోపాలనే కాదు, కనీసం వయసునీ బయటకు చెప్పుకోరు. అరవై ఏళ్లొచ్చినా ఇంకా అందంగా కనిపించాలన్న తాపత్రయం. కానీ రజనీకాంత్ అలా కాదు. తానేమిటో.. అలానే కనిపించాలనుకొంటారు. ఆ సొబగులన్నీ తెరపైనే. ''అరవై ఏళ్లొచ్చాక కథానాయికలతో డ్యూయెట్లు పాడడం ఓ పెద్ద శిక్ష..'' అని బాహాటంగా చెప్పగలిగారంటే.. రజనీ సింప్లిసిటీకి అంతకంటే నిదర్శనం మరేముంటుంది?? ''నన్ను అందంగా చూపించడానికి టీమ్ చాలా కష్టపడింది..'' అంటూ తనపైనే తాను సెటైర్ వేసుకోవడం మాటలు కాదు. కేవలం రజనీకాంత్‌కి మాత్రమే అది సాధ్యమైంది. హుద్ హుద్ సందర్భంగా ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమానికి రజనీకాంత్ వస్తానన్నారు. కానీ రాలేదు. ఈ విషయంలో ఆయన్నెవరకూ నిందించక్కర్లెద్దు. ''ఎందుకు రాలేదు..'' అని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ సంగతి కూడా అంతా మర్చిపోయిన తరుణంలో ''నేను ఆ కార్యక్రమానికి రాలేకపోయాను.. నన్ను తెలుగు ప్రజలు క్షమించాలి'' అని చేతిలెత్తి నమస్కరించిన సంస్కారం కేవలం రజనీకే చెల్లు! త్వరలోనే రజనీకాంత్ తన విరాళాన్ని ప్రకటిస్తానని కూడా మాటిచ్చారు. లింగ ఆడియో విజయోత్సవ వేడుకలో మరోసారి ఆయన రాజమౌళికి కీర్తించారు. భారతదేశంలోనే గొప్ప దర్శకుడు అవుతారని కితాబిచ్చారు. అవకాశం ఇస్తే, తన దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తలుపులు తెరిచారు. రజనీ అంత స్థాయి ఉన్న హీరో.. ''నేను మీ దర్శకత్వంలో నటించాలనిఎదురుచూస్తున్నా..'' అన్నాడంటే విశేషమే. మొత్తానికి రజనీ మరోసారి తన సింప్లిసిటీతో అదరగొట్టాడు. తానెందుకు ప్రత్యేకమో చాటి చెప్పాడు. హ్యాట్సాప్ రజనీ..