English | Telugu
సూపర్ స్టార్ చూపు ఎటువైపు?
Updated : Nov 10, 2014
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చేలిస్టులో ఎప్పుడు నుంచో వినిపిస్తున్న పేరు సూపర్ స్టార్ రజినీకాంత్ ది. మరి జనాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. రజినీకి ఉన్న క్రేజ్ సౌత్ లో మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక వ్యక్తిగతం గాను ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఎక్కడా ఆయనపై ఆరోపణలు లేవు. మచ్చలేని జీవితం రజినీకాంత్ ది. అందుకే ఆయన పాలిటిక్స్ లోకి వస్తే జనానికి మేలు జరుగుతుందని చాలామంది చెబుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం ఎప్పుడూ దానిపై క్లారిటీ ఇవ్వలేదు. వస్తానని కానీ రానని కానీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అంతా పైవాడే చూసుకుంటాడంటూ వేదాంతధోరణిలో సమాధానమిస్తారాయన. రజినీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడెందుకు డౌట్ వచ్చిందంటే.. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ స్తబ్దత నెలకొంది. జయపై కేసులున్నాయి. ఈ మధ్య జైలులో ఉండాల్సి వచ్చింది. అటు కరుణ ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగా లేదు. కరుణానిధి కొడుకులు కొట్టుకుంటున్నారు. కనిమొళికి, స్టాలిన్ కు గ్యాప్ ఏర్పడింది. కరుణానిధి ఎంత నచ్చజెప్పినా ఆయన సంతానం వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఆయనకా ఏజ్ అయిపోయింది. ఏం చేయలేరు. అన్నాడీఎంకే లేదా డీఎంకే తప్ప ... కాంగ్రెస్, బీజేపీకి ఇన్నాళ్లూ అక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకే రజినీ పాలిటిక్స్ లోకి ఎంటర్ కావడానికి ఇదే మంచి తరుణమంటున్నారు విశ్లేషకులు.
రజినీని పాలిటిక్స్ లోకి తీసుకొచ్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈసారి కూడా ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జాతీయపార్టీలు ఆయనపై కన్నేశాయి. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఆయనతో టచ్ లో ఉన్నాయట. అయితే కాంగ్రెస్ వైపు రజినీ వెళ్లకపోవచ్చు. కానీ బీజేపీకి మాత్రం ఎక్కువ అవకాశాలున్నాయట. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కూడా రజినీని ఒప్పించే ప్రయత్నం చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే రజినీ మాత్రం ఏవిషయం చెప్పలేదట. దళపతి బీజేపీలోకి వస్తే తమిళనాడులో సమీకరణాలు మారడం ఖాయం. అన్నాడీఎంకే, డీఎంకే వాష్ ఔట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆరెండు పార్టీలు రజినీ రాజకీయాల్లోకి రాకూడని కోరుకుంటున్నాయట. అయితే దేవుడు శాసించాడు... అరుణాచలం పాటిస్తాడు అని ఓ సినిమాలో చెప్పిన సూపర్ స్టార్... అలా సడన్ గా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తే బావుండని బీజేపీ బలంగా కోరుకుంటోంది.